ట్రంప్ పదవీకాలం పూర్తయ్యేదాకా చర్చల్లేవ్.. ఇరాన్ ఘాటు స్పందన..!
పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం కోసం ట్రంప్ సర్కార్ చేపడుతున్న చర్యలు ఫలితమిచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే ట్రంప్.. తన మాట మీద నిలబడరని ఇరాన్ ఆరోపిస్తోంది. అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చర్చలు జరపడం అనవసరమని తలపోస్తోంది. ఇదే విషయాన్ని ఇటీవలే ఇరాన్ తేల్చి చెప్పింది.
డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం పూర్తయ్యేదాకా అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా తమ షరతులు అంగీకరించే వరకూ హర్మూజ్ జల సంధిని తెరిచే ప్రసక్తి లేదని ఇరాన్ విదేశాంగశాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి తెలిపారు. రేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతోపాటు యుద్ధంవల్ల ఇరాన్‌కు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్ని విడుదల చేయాలని బఘేయి డిమాండు చేశారు.
మీరే పరిహారం చెల్లించాలి ట్రంప్
గత ఐదు నెలలుగా యుద్ధంవల్ల కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఇరాన్ కోరుతోందని, అది మంచి ఐడియానే అని, అయితే చాలా ఏళ్లుగా చేస్తున్న అరాచకాలకు ఆ దేశం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఇరాన్ అరాచకాలు చేస్తోందని, ఆందోళనల సందర్భంగా వేల మందిని చంపిందని, గత ఐదు నెలల్లో చంపిన 52,000 మందికీ పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు.








