అమెరికాది ఆంక్షల వ్యసనం.. తగ్గేదే లేదన్న ఇరాన్..!
పశ్చిమాసియా వార్ సందర్భంగా ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించడాన్ని టెహ్రాన్ ప్రతినిధులు తీవ్రంగా తప్పుపట్టారు. తమపై ఆంక్షలు విధించడం అమెరికాకు వ్యసనంలా మారిందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ విమర్శించారు. ఆంక్షలతో ఇరాన్‌ను ‘ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం’ అని అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చెప్పడంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దౌత్య మార్గంలో లక్ష్యాలను సాధించలేనప్పుడల్లా అమెరికా ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. అవి ఫలించకపోతే మరింత తీవ్రత పెంచుతోందని పేర్కొన్నారు. ఇది ఒక అలవాటుగా, చివరకు వ్యసనంగా మారిందని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు.
ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదని బఘాయీ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొంటూనే ఉన్నామన్నారు. అమెరికా నేతలు ఈ చెడు అలవాటును కొనసాగిస్తే.. సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడే అవకాశాలను వారే దెబ్బతీసుకుంటారని హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ నెట్‌వర్క్‌లపై ఆధారపడుతోందని స్కాట్ బెసెంట్ (Scott Bessent) ఆరోపించారు. వారి అక్రమ ఆర్థిక నెట్‌వర్క్‌లను గుర్తించి ధ్వంసం చేస్తామని తెలిపారు.
ఇరాన్ సైన్యంలో కీలక నియామకాలు జరిగాయి. సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) ఈ మార్పులు చేశారు. మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీని సాయుధ దళాల చీఫ్‌గా, కియుమర్స్ హైదారిని డిప్యూటీగా నియమించారు. అలాగే ఐఆర్జీసీ (IRGC) కమాండర్‌గా మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీ, డిప్యూటీగా మోస్తఫా ఇజాదీ బాధ్యతలు చేపట్టారు. మొజ్తబా సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైన్యంలో చేసిన తొలి కీలక నియామకాలు ఇవే కావడం గమనార్హం.








