మరోసారి బీజేపీ ‘హిందూత్వ’ అస్త్రం…

భారతీయ జనతాపార్టీ మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.మరీ ముఖ్యంగా రాజకీయ బాహుబలి నరేంద్ర మోడీ..హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తున్నారు. ఓవైపు సంఘ్ పరివార్ సంస్థలు , బీజేపీ నేతలు.. కమలం పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మోడీ మాటిమాటికీ సంక్షేమ మంత్రాన్ని పఠిస్తున్నారు. అయితే… అలాంటి మోడీ.. ఇప్పుడు మరోసారి హిందూత్వ అస్త్రాన్ని తెరపైకి తెచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్బన్ నక్సల్ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు, సోదరీమణుల మెడల్లోని మంగళసూత్రాలను కూడా వదలరని, వాళ్లు ఆ స్థాయికి కూడా వెళ్లగలరని మండిపడ్డారు. తల్లులు, సోదరీమణుల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కపెట్టి, దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామని, తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు. ఈ దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే చెప్పిందని మోడీ గుర్తుచేశారు. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వివాదాస్పద ‘ఫస్ట్ క్లెయిమ్’ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు.
ఇప్పటికే అయోధ్య రామమందిరం నిర్మాణం అంశాన్ని ప్రజల్లోకి బలంగాతీసుకెళ్తోంది బీజేపీ. ఊరు ఊరునా, వీధివీధినా జైశ్రీరామ్ నినాదాలు మార్మోగుతున్నాయి. దీంతో మరోసారి యూపీని కొల్లగొట్టబోతున్నామని బీజేపీ నేతలు, కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. దీనికి తోడు వారణాసి నియోజకవర్గం నుంచి మోడీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే వారణాసి అభివృద్ధికి మోడీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తన చరిష్మాతో యూపీ మొత్తాన్ని కమలమయం చేస్తున్నారు. దీంతో యూపీలోని 80 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపుఖాయమంటోంది కమలదళం..
ముఖ్యంగా దేశప్రజల మనోభావాల్ని చాలా క్లియర్ గా చేస్తోంది బీజేపీ. గతంలో అతివాద, మితవాద హిందూత్వ భావనలుండేవి. ఇప్పుడు కేవలం ఒకటే హిందూత్వం.. లేదంటే యాంటీ హిందూత్వంగా మారుతోంది. పక్కాగా చెప్పాలంటే హిందూ ఓట్ల పోలరైజేషన్ కు మోడీ గట్టిగానే ప్రయత్నిస్తున్నారని .. విశ్లేషకులు చెబుతున్నారు. మరి దీన్ని అడ్డుకునే శక్తి విపక్షాలకు ఏపాటి ఉందన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.