Sergio Gor: ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్ వెనక సెర్గియో గోర్…!
దాదాపు ఏడాదిపాటు అమెరికా-ఇండియా మధ్య నెలకొన్న ట్రేడ్ డీల్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన దూదిపింజలా తొలగిపోయింది. టారిఫ్ ల విషయంలో మొండిపట్టుదలతో ప్రపంచానికి కునుకు లేకుండా చేస్తున్న ట్రంప్ మెట్టుదిగేలా చేసింది. అంతేనా.. అమెరికా నుంచి వ్యవసాయేతర ఉత్పత్తుల దిగుమతుల విషయంలో వెనక్కు తగ్గేది లేదన్న భారత ప్రధానిని సున్నితంగా ఒప్పించింది. ఇరుదేశాలను ఒప్పించి, మెప్పించిన వ్యక్తి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు వీర విధేయుడు భారత్ లో అమెరికా రాయభారి సెర్గియో గోర్(Sergio Gor)..
ఎవరీ సెర్గియో గోర్..?
భారత్‌లో అమెరికా రాయబారిగా జనవరిలో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇరుదేశాల (India-US) మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య బంధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్‌లు, ఆయన చేసిన ప్రకటనలు రెండు దేశాల సంబంధాల్లో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించగా.. రాయబారిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది సమయంలోనే భారత్-అమెరికా సంబంధాలను పునర్నిర్మించడంలో గోర్ కీలకపాత్ర పోషించారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహం వల్లే ఈ ఒప్పందానికి అంగీకారం లభించిందని ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇప్పటినుంచి రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందని అభివర్ణించారు.
39 ఏళ్ల సెర్గియో.. ట్రంప్‌నకు వీర విధేయుడు. అందుకే అతితక్కువ కాలంలోనే ఆయన ట్రంప్ పరిపాలన విభాగంలో స్థానం సంపాదించగలిగారు. అత్యంత వివాదాస్పదమైన వ్యక్తుల్లో ఒకరైన సెర్గియో గోర్ (sergio Gor)ను భారత్ అమెరికా రాయబారిగా, దక్షిణ, మధ్యఆసియాలో పర్యవేక్షకుడిగా నియమించడం అప్పట్లో దౌత్యవర్గాలను షాక్‌కు గురిచేసింది. గోర్ నియామకంపై భారత్‌లో మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ట్రంప్ మాత్రం ‘‘నా అజెండాను అమలుచేయడానికి నేను పూర్తిగా విశ్వసించే ఓ వ్యక్తి నాకు కావాలి. ఆ విషయంలో సెర్గియో గొప్ప రాయబారి అవుతాడు’’ అని పొగడ్తల వర్షం కురిపించారు.
1990ల్లో గోర్ కుటుంబం అమెరికా (USA)కు వలస వచ్చింది. ఆయన తల్లిదండ్రులవి రష్యా మూలాలు. అమెరికా వచ్చిన కొంతకాలానికే గోర్‌కు పౌరసత్వం లభించింది. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన ఆయన.. 2008లో పొలిటికల్ సైన్స్, అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. తొలినుంచి రిపబ్లికన్ పార్టీతో సంబంధాలు కొనసాగించిన గోర్.. రిపబ్లికన్ నేషనల్ కమిటీకి కమ్యూనికేషన్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేశారు. 2020లో ట్రంప్ హయాంలో విక్టరీ ఫైనాన్స్ కమిటీకి చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులు కావడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. తర్వాత ఆయన ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ‘మేయర్ ఆఫ్ మార్-ఎ-లాగో’గా నిక్‌నేమ్‌ను సంపాదించుకున్నారు. మార్-ఎ-లాగో అనేది ఫ్లోరిడాలోని ట్రంప్ రిసార్ట్ పేరు.
గోర్.. భారత్‌కు రాయబారిగా నియమితులు కాకముందు వైట్‌హౌస్‌లో పర్సనల్ డైరెక్టర్‌గా పనిచేశారు. ట్రంప్ (Donald Trump) రాజకీయ అజెండాకు తగ్గట్టుగా నిర్ణయాలు అమలుచేశారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీల మధ్య స్నేహబంధం నిజమైందేనన్నారు. తమకు భారత్ తర్వాతే ఎవరైనా అని పేర్కొన్నారు. అన్నట్టుగానే పాక్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోలిస్తే.. మన దేశంపై ప్రకటించిన సుంకాలే తక్కువ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.






