EU: శరణార్థుల సంఖ్యలో ఈయూ కోత.. ఏడు దేశాల శరణార్థులకు చిక్కులే..!
ప్రపంచదేశాలు మొత్తంగా తమ భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. వేరే దేశాల పౌరులకు తామెందుకు ఆశ్రయం కల్పించాలని, అది తమ ఆర్థిక వ్యవస్థకు భారంగా పరిగణిస్తున్నాయి. ఇటీవలే అమెరికా శరణార్థుల విషయంలో కోత విధించింది.లేటెస్టుగా యూరోపియన్ యూనియన్ దేశాలు సైతం అమెరికా బాటలో నడుస్తున్నాయి. ఇది నిరంతరం హింసాగ్నితో ప్రజ్వరిల్లుతున్న దేశాల నుంచి వస్తున్న శరణార్థులకు శరాఘాతమే అని చెప్పవచ్చు.
భారత్ సహా ఏడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల అభ్యర్థనలను తక్కువగా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, కొలంబియా, ఈజిప్ట్, కొసావో, మొరాకో, ట్యునీషియా ఉన్నాయి. ఈ దేశాలను సురక్షిత దేశాలుగా పరిగణిస్తూ ఈ మేరకు నిర్ణయించింది. దీనిపై మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
సాయుధ ఘర్షణల వంటి సందర్భాల్లో విచక్షణారహిత హింస చోటుచేసుకోని దేశాలను తాము సురక్షితమని భావిస్తున్నట్లు యూరోపియన్ యూనియన్ వెల్లడించింది. ఈ మేరకు యూరప్ పార్లమెంట్, యూరోపియన్ కౌన్సిల్ మధ్య జరిగిన ఒప్పందం వెల్లడి చేస్తోంది. ఈ నిబంధన తమకు వర్తించదని దరఖాస్తుదారులు నిరూపించుకోవాల్సి ఉంటుంది.
2026 జూన్ నుంచి అమల్లోకి రానున్న ఈ ఒప్పందాన్ని రానున్న రోజుల్లో ఇతర దేశాలకు విస్తరించనున్నారు. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఆయా దేశాలు సురక్షితమని భావిస్తే తిరిగి ఈ శరణార్థులను వారి దేశాలకు పంపించే అవకాశం ఉంది. అయితే శారీరక హింసకు గురయ్యే ప్రమాదం ఉన్నవారిని మాత్రం తిరిగి వారి దేశాలకు పంపకుండా మినహాయింపు ఇవ్వనున్నారు.
వలసదారులపై కఠిన విధానాలు అమలుచేస్తోన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కూడా శరణార్థులకు ఇచ్చే వర్క్ పర్మిట్ (US Work Permits) కాలవ్యవధిని కుదిస్తున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) ఇటీవల ప్రకటనలో తెలిపింది. శరణార్థులు, ఆశ్రయం పొందాలనుకునేవారు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారికి అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ కార్డ్ (EAD) కింద అనుమతులు జారీ చేస్తారు. దీనికి అయిదేళ్ల కాలవ్యవధి ఉండేది. ఈ సవరణలతో దాన్ని 18 నెలలకు కుదించారు. భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది.






