ట్రంప్ ఎలక్షన్ స్ట్రాటజీ..
అమెరికా అధ్యక్షపదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ గెలిస్తే.. దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని ట్రంప్ ప్రకటించారు. తనకు ఓటు వేస్తే.. రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశం నుంచి తరిమికొడతానని మిషిగాన్‌లో నిర్వహించిన ప్రచారంలో వ్యాఖ్యానించారు. ఐసిస్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అమెరికా అధికారులు శనివారం అరెస్టు చేసిన వేళ ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
మన దేశం ఇప్పుడు పడినంత ప్రమాదంలో ఎప్పుడూ లేదు. వేలాది మంది ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారు. దీనికి అనేక ఏళ్లపాటు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో.. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటరు ఛాయిస్ సుస్పష్టం. వేలాదిమంది రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దేశంలోకి అనుమతించే అధ్యక్షుడు కావాలా? లేదా అటువంటి వారిని దేశం నుంచి బయటకు పంపించే అధ్యక్షుడు కావాలా? అనేది నిర్ణయించుకోండి’’ అని ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజు నుంచే దేశ చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ను మొదలుపెడతానన్నారు. ఇలా చేయడం తప్ప మరో మార్గం లేదని చెప్పారు.
అగ్రరాజ్యంలోకి వలసలు పోటెత్తుతున్నాయంటూ రిపబ్లికన్లు ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వలసదారులు అమెరికాకు రావడాన్ని డెమోక్రటిక్ నేత, దేశాధ్యక్షుడు జో బైడెన్ సులభతరం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక సందర్భాల్లో ట్రంప్ తన వలసల వ్యతిరేక విధానాలను ఓటర్ల ముందు ఉంచారు. వలసదారులను పూర్తిగా తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతేకాదు మెక్సికో సరిహద్దుల్లో పూర్తిగోడ కడతామని గతంలో హామీ ఇచ్చారు ట్రంప్. మెక్సికో నుంచి చాలా మంది అమెరికాలో చొరబడుతున్నారని..వారిని రాకుండా చేస్తామన్నారు. దాదాపు 300 బిలియన్ డాలర్లు ఈగోడ కట్టడానికి అవసరమవుతుందని అంచనాలున్నాయి. మెక్సికో నుంచి అనధికారికంగా వస్తున్నవలసదారులను నియంత్రించేందుకు ఈప్రణాళికను గతంలో ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. అనధికారికంగా వచ్చిన వలసదారులు.. క్రమేణా అమెరికా సమాజంలో భాగస్వాములవుతున్నారు. ఈపరిణామం స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులను తెస్తోంది.
అయితే సమాజంలో కీలక వర్గాలను తమవైపు ఆకర్షించేందుకే ట్రంప్ ఈప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరీముఖ్యంగా యువత..తమ జాబ్స్ పోతున్నాయన్న ఆందోళనలో ఉండడంతో.. వారిని ఈప్రకటన ఆకర్షించే అవకాశముంది. దీనిలో భాగంగా స్థానికంగా ఉద్యోగాల్లో కూడా అమెరికన్స్ కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న నినాాదాన్ని తెచ్చారు ట్రంప్.






