నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం! బీ కేర్ ఫల్!!
మాయదారి మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికించేస్తోంది. 2019 డిసెంబర్ లో మొదలైనా ఈ మహమ్మారి పంజా 2020లో ప్రపంచం మొత్తం చూసింది. ఉపాధి లేక, ఉద్యోగాలు ఊడిపోయి.. తినేందుకు తిండి లేక.. వెళ్లేందుకు దిక్కులేక.. లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రుల్లో ఇబ్బందులు, అయినవాళ్లను కోల్పోయిన ఆర్తనాదాలు చూసి చలించిపోయాం. లాక్ డౌన్లు, కర్ఫ్యూలు చూసిన తర్వాత అలాంటి పరిస్థితులు పొరపాటున జీవితంలో మరోసారి రాకూడదని బలంగా కోరుకున్నాం.
కానీ ఏదైతే వద్దనుకున్నామో.. మళ్లీ అలాంటి పరిస్థితులే వచ్చేశాయి. ఆంక్షలు మొదలైపోయాయి. కర్ఫ్యూలు స్టార్ట్ అయ్యాయి. లాక్ డౌన్ లూ పెట్టేస్తున్నారు. ఇంకెన్ని ఆంక్షలు వస్తాయో ఇప్పుటికిప్పుడు ఊహించలేం. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ మొదలైపోయింది. థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, స్కూళ్లు క్లోజ్ అయ్యాయి. పగటిపూట మాత్రమే ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ ఆంక్షలు ఎంతకాలం ఉంటాయో కూడా చెప్పేందుకు వీలు కావట్లేదు.
అసలీ ఇబ్బందులన్నింటికీ కారణం కరోనా మహమ్మారి. తగ్గిపోయిందనుకున్న వైరస్ ప్రభావం మళ్లీ తిరగదోడడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి దాపురించింది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ ప్రభావానికి కారణం.. జనం అంతులేని నిర్లక్ష్యమే. జాగ్రత్తగా ఉండండి.. మాస్కులు ధరించండి.. భౌతికదూరం మర్చిపోవద్దు.. లాంటి అనేక జాగ్రత్తలను ఎన్నిసార్లు చెప్పినా జనం పట్టించుకోలేదు. లాక్ డౌన్ సడలింపులు ఇచ్చింది మొదలు రోడ్లపైకి వచ్చేశారు. విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టారు. టూర్లు, షికార్లు వెళ్లారు.
మొదటి వేవ్ ని సమర్థంగా ఎదుర్కొన్నామని చంకలు గుద్దుకుంటున్న సమయంలోనే సెకండ్ వేవ్ పంజా విసరడం మొదలుపెట్టింది. ఇది మామూలు పంజా కాదు. ఫస్ట్ వేవ్ ని మించిన పంజా. సెకండ్ వేవ్ స్పీడ్ చూసి బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. కేసుల్లో ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ లో దూసుకుపోతున్నాం. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. చేతిలోని అస్త్రాలన్నింటినీ ప్రయోగిస్తున్నా మహమ్మారి ఆగట్లేదు. దీన్ని ఎలా కంట్రోల్ లోకి తీసుకురావాలో తెలియట్లేదు.
కరోనా వైరస్ పూర్తిగా పోలేదని, ముప్పు ఇంకా పొంచే ఉందని మొబైల్ ఫోన్ రింగ్ టోన్ల ద్వారా నిత్యం మార్మోగిస్తున్నా జనం ఏమాత్రం ఖాతరు చేయలేదు. అందుకే ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది. నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఇప్పుడైనా మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. మాస్కులు.. శానిటైజర్లు వాడుతూ.. భౌతికదూరం పాటించాలి. లేకుంటే మళ్లీ లాక్ డౌన్ తప్పకపోవచ్చు. మనం మరింత మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు.













