Modi – CBN: మోడీ తర్వాత ప్రధాని రేసులో చంద్రబాబు.. రాయిటర్స్ అంచనా!!
భారత రాజకీయాల్లో మోడీ తర్వాత ఎవరు? అనే ప్రశ్న ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే, ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఇటీవల ప్రచురించిన కథనం ఈ చర్చను మరో మలుపు తిప్పింది. 2029 నాటికి ప్రధాని మోడీ వయస్సు 79 ఏళ్లకు చేరుతుందని, ఆ సమయంలో ఆయన క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకుంటే వారసులెవరు అనే కోణంలో రాయిటర్స్ ఒక ఆసక్తికర విశ్లేషణను బయటపెట్టింది.
రాయిటర్స్ అంచనా ప్రకారం, బిజెపిలో మోడీ తర్వాత అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న అమిత్ షా మొదటి వరుసలో ఉన్నారు. పార్టీ యంత్రాంగంపై ఆయనకున్న పట్టు, వ్యూహకర్తగా ఆయనకున్న గుర్తింపు దీనికి ప్రధాన కారణాలు. ఇక మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ పేరును కూడా రాయిటర్స్ పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం. అయితే, క్షేత్రస్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన, హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా పేరుగాంచిన యోగి ఆదిత్యనాథ్ పేరును రాయిటర్స్ విస్మరించడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో వరుస విజయాలు సాధిస్తూ, మోడీ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నేతను కాదని ఫడ్నవీస్ పేరును తెరపైకి తేవడం వెనుక రాయిటర్స్ లాజిక్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఈ కథనంలో అత్యంత విడ్డూరమైన అంశం ఏమిటంటే.. ప్రధాని రేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ పేర్లను ప్రస్తావించడం. ఒకవేళ 2029లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ రాకుండా, ఎన్డీయే కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే, అప్పుడు దక్షిణాది నేతగా చంద్రబాబుకు అవకాశం దక్కవచ్చని రాయిటర్స్ అభిప్రాయపడింది. కానీ ఇక్కడ కొన్ని ప్రాథమిక వాస్తవాలను రాయిటర్స్ విస్మరించినట్లు కనిపిస్తోంది. 2029 నాటికి మోడీకి 79 ఏళ్లు వస్తాయని ఆయనను పక్కన పెడితే, చంద్రబాబు కూడా అదే వయస్సులో ఉంటారు. వాస్తవానికి మోడీ కంటే చంద్రబాబు 6 నెలలు పెద్ద. వయస్సు రీత్యా మోడీ తప్పుకుంటే, అంతకంటే పెద్దవారైన చంద్రబాబును బిజెపి అగ్రనాయకత్వం ఎలా అంగీకరిస్తుంది?. జాతీయ రాజకీయాల్లో బిజెపి నేడు అత్యంత శక్తివంతంగా ఉంది. గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ వంటి హేమాహేమీలను కాదని, ఒక ప్రాంతీయ పార్టీ నేతకు ప్రధాని పీఠాన్ని అప్పగించే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు.
చంద్రబాబు కానీ, లోకేశ్ కానీ ఏనాడూ తమకు ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉన్నట్లు ఎక్కడా వ్యక్తం చేయలేదు. “నా దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైనే” అని చంద్రబాబు పలుమార్లు స్పష్టం చేశారు. లోకేశ్ కూడా రాష్ట్ర రాజకీయాల్లోనే తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో సాగుతున్న ప్రచారం ప్రకారం.. 2029లో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే, చంద్రబాబుకు జాతీయ స్థాయిలో గౌరవప్రదమైన రాష్ట్రపతి లేదా గవర్నర్ వంటి పదవులు దక్కవచ్చని, ఆ సమయంలో రాష్ట్ర బాధ్యతలను లోకేశ్ కు అప్పగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ‘ప్రధాని పదవి’ అనేది మాత్రం అతిశయోక్తిగానే తోస్తోంది.
అంతర్జాతీయ మీడియా సంస్థలు ఒక్కోసారి క్షేత్రస్థాయి సమీకరణాలను వదిలేసి, కేవలం గణాంకాలు లేదా పాత రాజకీయ ముద్రల ఆధారంగా విశ్లేషణలు చేస్తుంటాయి. రాయిటర్స్ కథనం కూడా ఆ కోవలోకే వస్తుంది. దక్షిణాదిలో టీడీపీకున్న పట్టును గుర్తించిన రాయిటర్స్, దేశ ప్రధాని పదవి విషయంలో మాత్రం భారతీయ రాజకీయాల్లోని ‘వయస్సు పరిమితులు’, ‘బిజెపి అంతర్గత పట్టు’ వంటి కీలక అంశాలను సరిగ్గా అంచనా వేయలేకపోయిందనిపిస్తోంది. ఏది ఏమైనా, 2029కి ఇంకా చాలా సమయం ఉంది. పైగా తాను తప్పుకుంటానని మోడీ ఇంతవరకూ ప్రకటించలేదు. పార్టీ కూడా ఆయన్ను తప్పించే ఆలోచనలో లేదు. అయినా అప్పటి రాజకీయ పరిస్థితులు, బిజెపి బలాబలాలను బట్టి ఈ సమీకరణాలు ఎటువైపు అయినా మారవచ్చు.






