Biden: ఉక్రెయిన్ కు భారీ బొనాంజా.. బైడెన్ సర్కార్ సాయం పెంపు..
అమెరికా (USA) అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసే రోజు దగ్గరపడే కొద్దీ.. బైడెన్ సర్కారు ఉక్రెయిన్‌కు సాయాన్ని వేగవంతం చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌కు దీర్ఘకాలంలో దాదాపు బిలియన్ డాలర్లు (సాయం చేస్తామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ప్రకటించారు. ఇప్పటికే దేశ కాంగ్రెస్ ఆమోదముద్ర వేసిన ప్యాకేజీల మొత్తాన్ని ట్రంప్ కార్యవర్గం అధికారం చేపట్టకముందే.. కీవ్‌కు అందజేసేందుకు తొందరపడుతోంది. ‘‘త్వరలోనే ఈ బాధ్యత కొత్త ప్రభుత్వం చేతికి వెళుతుంది. వారే ఈ యుద్ధం ఏ మార్గంలో వెళ్లాలో నిర్ణయిస్తారు. మేము కొన్నేళ్లుగా వేసిన బలమైన పునాదిపై వారూ ముందుకెళతారని ఆశిస్తున్నాను’’ అని లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు.
తాజా ప్యాకేజీల్లో డ్రోన్లు, హిమార్స్ రాకెట్ వ్యవస్థల్లో వాడే మందుగుండు సామగ్రి వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం ఉన్న దశను బట్టి వీటి అవసరం చాలా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ అసిస్టెన్స్ ఇనీషియేటివ్ కార్యక్రమం కింద వీటిని అందిస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆయుధ సామగ్రి అందజేస్తున్నామని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ఇటీవలే ప్రకటించారు. తాజాగా దానికి అదనంగా 988 మిలియన్ డాలర్ల సామగ్రిని ఇస్తామని బైడెన్ కార్యవర్గం ఉక్రెయిన్‌కు హామీ ఇచ్చింది.
అమెరికా నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్లు ఆయుధాలు, ఇతర సాయం అందించారు. ట్రంప్ వస్తే .. ఆయుధసాయం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఓవైపు ఆయుధసాయం తగ్గిస్తూనే, రష్యాతో చర్చల దిశగా ఉక్రెయిన్ ను అమెరికా ప్రోత్సహించనుంది.






