కవిత – సుఖేశ చంద్రశేఖర్ – ఈడీ …. ఈ ముగ్గురిలో ఎవరిని నమ్మాలి?
ఢిల్లీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆప్, బీఆర్ఎస్, వైఎస్సాసీపీ నేతలు సీబీఐ, ఈడీ విచారణలతో బిజీగా ఉన్నారు. తమకు అనుకూలంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించుకున్న సౌత్ గ్రూప్, ఆప్ నేతలకు అక్రమంగా లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నించిందనేది ఈ వ్యవహారం వెనుక ఆరోపణ. అయితే ఇప్పుడు ఈ సీన్ లోకి ఆర్థిక నేరస్థుడు సుఖేశ్ చద్రశేఖర్ ఎంటరయ్యారు. తానే ఆప్, బీఆర్ఎస్ నేతలకు మధ్య ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు. దీనిపై విచారణ జరిపిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని, ఇందుకు తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు సుఖేశ్ చంద్రశేఖర్.
ఢిల్లీ లిక్కర్ స్కాంను కేంద్రంలోని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై కేసులు నమోదు చేసిన దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ ఇప్పటికే పలువురిని విచారించాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను జైలుకు పంపించాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి, రాఘవ రెడ్డి తదితరులు కూడా జైలు పాలయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉందనేది ఈడీ ఆరోపణ. ఇప్పటికే రెండు సార్లు విచారించిన ఈడీ.. ఫోన్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు సాగిస్తోంది. ఈ కేసులో కవిత అరెస్టు కూడా ఖాయమని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు సుఖేశ్ చంద్రశేఖర్ తనంతట తానుగా ఈ వ్యవహారంలోకి దూసుకొచ్చారు. ఆప్ నేతలు ఇవ్వజూపిన డబ్బును హైదరాబాద్ లో కవిత మనుషులకు తానే ఇచ్చాననేది సుఖేశ్ చంద్రశేఖర్ చెప్తున్న మాట. దీనికి సంబంధించి మొదట కేజ్రివాల్ ఆరోపణలతో మొదటి లేఖ విడుదల చేశారు. తాజాగా తాను కవితతో చాట్ చేసినట్లు చెప్తున్న మరో లేఖను, అందుకు సంబంధించి వాట్సాప్ స్క్రీన్ షాట్లను బయటపెట్టారు సుఖేశ్ చంద్రశేఖర్. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది తెలీదు. కానీ ఇందులో చేసిన ఆరోపణలు మాత్రం తీవ్రంగా ఉన్నాయి. నెయ్యి అనే కోడ్ తో డబ్బు అందజేసినట్లు చెప్పారు. రూ.15 కిలోల నెయ్యిని అంటే రూ.15 కోట్ల రూపాయలు కవిత మనుషులకు అందజేసినట్లు తెలిపారు.
అయితే సుఖేశ్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదన్నారు కవిత. సుఖేశ్ లేఖ రాయగానే దీనిపై బీజేపీ నేతలు చూపిస్తున్న అత్యుత్సాహాన్ని చూస్తే దీని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. కేసీఆర్ పై ఈర్ష్యతోనే ఇలాంటి చిల్లర పనులకు కొంతమంది వ్యక్తులు, ఒక వర్గం మీడియా పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. దేనికీ తలవంచేది లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్.. ఆప్ నేతలకు ముడుపులు ఇచ్చిందనేది ఈడీ ఆరోపణ. కానీ సుఖేశ్ చంద్రశేఖర్ మాత్రం ఆప్ నేతలు బీఆర్ఎస్ నేతలకు ఇవ్వాల్సిన డబ్బును తానే అందజేసినట్లు చెప్తున్నారు. మరి ఏది వాస్తవం? తేలాల్సి ఉంది.













