ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్..! తెరపైకి కొత్త పేర్లు..!!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ మళ్లీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి సోమవారం ఈడీ రెండు అనుబంధ ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. దీంతో ఈ కేసులో మరికొందరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కు కూడా ఈ కేసులో ప్రమేయం ఉందని ఈడీ వెల్లడించింది. దీంతో తదుపరి విచారణకు వీళ్లను కూడా పిలుస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ లోతైన విచారణ సాగిస్తోంది. విచారణ లోతుల్లోకి వెళ్లేకొద్దీ కొత్త పేర్లు, కొత్త పాత్రధారులు బయటకు వస్తున్నారు. ఇన్నాళ్లూ సౌత్ గ్రూపుకు చెందిన శరత్ చంద్రా రెడ్డి, మాగుంట ఫ్యామిలీ, ఎమ్మెల్సీ కవిత, రామచంద్ర పిళ్లై.. తదితరుల పేర్లు వచ్చాయి. అలాగే ఢిల్లీకి సంబంధించి మనీశ్ సిసోడియా, విజయ్ కుమార్ నాయర్ లాంటి వాళ్లు ఈ డీల్ లో ప్రముఖ పాత్ర పోషించినట్లు ఈడీ వెల్లడించింది. ఇప్పటికే వీరిలో పలువురిని అరెస్టు చేసి జైలుకు పంపించింది. మిగిలిన వాళ్లను ఇంకా విచారణ జరుపుతోంది.
ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ను కూడా ఈడీ విచారించింది. అంతేకాక, గౌతమ్ మల్హోత్రా, అమన్ దీప్, మాగుంట రఘవ రెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. వీళ్లలో రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అతను ఇచ్చిక సమాచారం మేరకు ఈడీ ఈ కేసును దాదాపు ఒక కొలిక్కి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ ఢిల్లీ పెద్దలకు వంద కోట్ల దాకా ముడుపులు ఇచ్చినట్లు నిర్ధారణకు వచ్చింది.
అయితే ఈ కేసులో కొత్తగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరు తొలిసారి బయటకు వచ్చింది. సౌత్ గ్రూపుతో జరిగిన చర్చల్లో విజయ్ నాయర్ తో పాటు రాఘవ్ చద్దా పాల్గొన్నట్టు పేర్కొంది. మరోవైపు మద్యం వ్యాపారంలో వచ్చిన లాభాలతో సౌత్ గ్రూపు హైదరాబాద్ లో భారీగా స్థలాలు కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ పాత్ర కూడా ఉన్నట్టు వెల్లడించింది. దీంతో త్వరలోనే వీళ్లిద్దరినీ కూడా ఈడీ విచారించే అవకాశం ఉంది. మరోవైపు ఈ వారం రోజుల్లో మరో కీలక వ్యక్తిని అరెస్టు చేసే దిశగా ఈడీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.













