ఇప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించం : కేంద్ర ఎన్నికల సంఘం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఇప్పట్లో మాత్రం నిర్వహించమని తేల్చి చెప్పింది. ఈ నిబం పరిస్థితులు మెరుగు పడిన తర్వాతే ఎన్నికల నిర్వహణ గురించి ఆలోచిస్తామని తెలిపింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఖాళీలపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల కిందటే ఈసీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఈసీ పై విధంగా స్పందించింది. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక తెలంగాణలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో ఆరుగురి పదవీ కాలం వచ్చే నెల 3తో పూర్తవుతుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవీ కాలం మాత్రం జూన్ 16న ముగుస్తుంది. ఎమ్మెల్యే కోటాలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇక గవర్నర్ కోటా నుంచి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి స్థానం ఖాళీ కాబోతోంది.