కమలా హ్యారిస్ గెలవాలంటూ ప్రత్యేక పూజలు
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఈరోజు ఓటింగ్ జరుగుతుంది. భారతీయ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా జో బిడెన్ తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో డెమొక్రటిక్ పార్టీ తరపున ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న కమలా హ్యారిస్ ఈ ఎన్నికల్లో గెలుపొందాలని కోరుకుంటూ తమిళనాడులోని ఆమె స్వగ్రామమైన తులసేంద్రపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ కుటుంబానిది తమిళనాడులోని తిరువరూర్ జిల్లా మన్నార్గుడి తాలూకాకు చెందిన తులసేంద్రపురం. తమ గ్రామం నుంచి వలసవెళ్లిన కుటుంబానికి చెందిన ఓ మహిళ అమెరికాలో కీలక స్థానానికి పోటీ పడుతుండడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అయ్యనార్ (శివుడి అంశల్లో ఒకటి) దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊర్లో ఆమె గెలవాలని కోరుతూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు, గోడపత్రికలు వెలిశాయి.













