నా విడుదల వివరాలు వెల్లడించవద్దు…
జైలు నుంచి తానెప్పుడు విడుదల అవుతాననే వివరాలను బయటపెట్టవద్దని జయలలిత అత్యంత సన్నిహితురాలు వికె శశికళ అధికారులను కోరారు. ఈ మేరకు బెంగళూరులోని పరస్పన అగ్రహార జైలు సూపరింటెండెంట్‌కు ఈ నెల 19న ఆమె లేఖ రాశారు. ఆయాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైయిన శశికళ ఇప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తన జైలుశిక్ష, విడుదల తదితర అంశాలను సమాచార హక్కు చట్టం కింద ఎవరికీ వెల్లడించరాదని ఆమె కోరారు. వ్యక్తిగత గోప్యత హక్కు కూడా ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. తన వివరాలను సమాచార హక్కు కింద వెల్లడించడం కూడా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించినట్టు అవుతుందని పేర్కొన్నారు.
కొందరు రాజకీయ కారణాల తోనో, లేక పబ్లిసిటీ కోసమో సమాచార హక్కును అడ్డం పెట్టుకుని దరఖాస్తులు చేసుకుంటారని ఆమె ఆరోపించారు. బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది ఇటీవల సమాచార హక్కు కింద దరఖాస్తు చేయగా, జైలు అధికారులు స్పందించి శశికళ వచ్చే ఏడాది జనవరి 27న విడుదల అయ్యే అవకాశం ఉందని ఉందని సమాచారం వెల్లడించింది. న్యాయస్థానం విధించిన 10 కోట్ల జరిమానా చెల్లించితేనే జనవరి 27న విడుదల అయ్యే వీలుంటుందని, లేకుంటే 2022 ఫిబ్రవరి 27 వరకు జైలులో ఉండక తప్పదని తెలిపారు. ఈ నేపథ్యంలో శశికళ తరపు న్యాయవాది జైలు చీఫ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.













