నవంబరు 16 నుంచి అయ్యప్ప దర్శనాలు
కేరళలోని శబరిమలై ఆలయం ఈ ఏడాది నవంబరు 16న మండల మకరజ్యోతి దీక్షలు చేసే యాత్రీకుల కోసం తెరవాలని నిర్ణయించారు. ప్రతి శీతాకాలంలో రెండు నెలల మండలం మకర జ్యోతిదర్శనాల సీజన్లో లక్షలాదిగా అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. శబరిమలై యాత్రీకులు ప్రతి ఏటా 30 లక్షల మంది యాత్రీకులు సందర్శిస్తారు. అయితే ఈ ఏడాది కొవిడ్ కారణంగా శబరిమలై ఆలయం మూతపడింది. దేవస్థానం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ నవంబరు 16న ఆలయం తలుపులు తెరుచుకుంటాయన్నారు. అన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తారని, భక్తుల సంఖ్య కూడా పరిమితం చేస్తామన్నారు. భక్తులందరూ తీర్థయాత్ర చేపట్టేముందు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్లు సమర్పించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.
ఐసీఎంఆర్ గుర్తింపు ఉన్న ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుని కరోనా నెగిటివ్ వస్తేనే శబరికి రావాలని పేర్కొన్నారు. కరోనా నెటిటివ్ సర్టిఫికేట్లు ఉంటేనే అనుమతిస్తామని తెలిపారు. భౌతిక దూరం పాటించాలని కోరారు. ఆలయ దర్శనానికి హాజరు కావడానికి భక్తులు 20 సంవత్సరాలు, 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఒకేసారి ఐదుగురికి మాత్రమే పరిమితం చేస్తామని తెలిపారు. శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో కొవిడ్ నిబంధనల ప్రకారమే దేవస్థానం బోర్డు ఏర్పాట్లను ప్రారంభించింది.













