తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు నడిచేదెప్పుడు?
కరోనా కేసులు వెలుగు చూసిన అనంతరం.. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అన్ లాక్ మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర బస్సుల సర్వీసులు మొదలయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్, ఏపీ తెలంగాణ మధ్య మాత్రం ఆర్టీసీ బస్సులకు పచ్చ జెండా ఊపలేదు. రైళ్లు కూడా తక్కువగా నడుస్తుండటంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల విషయంలో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ప్రైవేటు క్యాబ్స్, అనధికారిక వాహనాలు ప్రజల్ని దోచుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు దఫాలుగా ఈ రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు సమావేశమయ్యారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు.
సమస్య ఏమిటి?
లాక్ డౌన్ అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొత్తగా ఒప్పందం చేసుకోవాలని, ఆ తర్వాతే బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు లాక్డౌన్ కు మునుపు ఎన్ని కిలోమీటర్ల మేర బస్సులు తిప్పుతున్నామో అన్ని కిలోమీటర్లు ఇప్పుడు తిప్పే అవకాశం లేదని టీఎస్సార్టీసీ అధికారులు అంటున్నారు. కొన్ని మార్పు చేర్పులతో ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రతిపాదించినంత మేర సర్వీసులు తిప్పడానికి కూడా వారు సముఖంగా లేనట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఒక కొలిక్కి రావడం లేదు.
మంత్రుల సమావేశం లేదు… తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య బస్సు సర్వీసులు నడిపే అంశంపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఏపీ రవాణా మంత్రి పేర్ని నాని సోమవారం సమావేశమవుతారని వచ్చిన వార్తలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ… అంతర్రాష్ర్ట బస్సు సర్వీసుల అంశంపై ఇంత వరకూ తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టత రాలేదని చెప్పారు. దీనిపై మంత్రుల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఏపీ రవాణా శాఖ మంత్రితో భేటీ కావడంపై ఇంకా ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని వివరించారు. కిలోమీటర్ బేసిస్‌లో అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల స్థాయి సమావేశం ఉంటుందన్నారు. అధికారుల స్థాయి సమావేశాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయన్నారు. .













