పాస్ పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ సమయం తగ్గింపు

పాస్ పోర్టుల జారీలో పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని తగ్గించేందుకు విదేశాంగ శాఖ కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోలీసులు తనిఖీ చేస్తారు. దీని తరువాతే పాస్పోర్టులను జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియను మరింత సరళీకరించాలని భావిస్తున్నట్లు పాస్పోర్టు దివస్ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలిపారు. పాస్ పోర్టులు దేశ అంతర్జాతీయ వ్యాపార రంగం అభివృద్ధిలో, గ్లోబల్ మొబిలిటీని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పాస్ పోర్టును మరింత త్వరితగతిన అందించేందుకు ఇప్పటికే 440 పోస్టాఫీస్ లోనూపాస్ పోర్టు సేవా కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో పాస్ పోర్టు సేవా కేంద్రాలు 93 ఉన్నాయి. 533 పాస్ పోర్టు ప్రాసెసింగ్ సెంటర్లు, 37 రీజనల్ పాస్ పోర్టు కార్యాయాలు పని చేస్తున్నాయి. విదేశాల్లో భారత పాస్ పోర్టుల జారీ చేసేందుకు 187 కేంద్రాలు పని చేస్తున్నాయి. పాస్ పోర్టులను మరింత వేగంగా జారీ చేసేందుకు పోలీస్ వెరిఫికేషన్ సమయాన్ని మరింత తగ్గించేందుకు విదేశాంగ శాఖ రాష్ట్రాలతోనూ, కేంద్ర పాలిత ప్రాంతాలతోనూ సంప్రదింపులు జరుపుతోందని జైశంకర్ తెలిపారు.