బీజేపీ గెలిస్తే సీఎం పదవి చేపట్టేందుకు నేను సిద్ధం!
త్వరలో బీజేపీలో చేరనున్న మెట్రో మ్యాన్ ఈ.శ్రీధరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందితే రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేయడం, కేరళలో భారీగా హౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై దృష్టిసారిస్తానని చెప్పారు. పార్టీ కోరితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు సీఎం పదవినీ చేపడతానని మెట్రో మ్యాన్‌గా పేరొందిన శ్రీధరన్ సృష్టం చేశారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రానికి నిధుల లభ్యత పెంచేందుకు ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం, పెద్దసంఖ్యలో పరిశ్రమలను తీసుకురావడం తమ ముందున్న లక్ష్యాలని వివరించారు.
రాష్ట్రంలో ప్రతి మళయాళీపై ప్రస్తుతం రూ.1.2 లక్షల అప్పుందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పులు తీసుకురావడం కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మనం పరిష్కారం అన్వేషించాల్సిన అవసరం ఉందని అన్నారు. తాను ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ పరిష్కారమవుతాయని ఆయన తేల్చి చెప్పారు.. ఇక ఈనెల 25న కాషాయ తీర్ధం స్వీకరించడం ద్వారా శ్రీధరన్ రాజకీయ రంగంలో ప్రవేశించనున్నారు.













