లోక్ సభలో అడుగుపెట్టిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన నాలుగు నెలల తర్వాత లోక్ సభకు హాజరయ్యారు. గతంలో మోదీ ఇంటి పేరు పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. రాహుల్ ఎంపీ హోదాను కూడా పునరుద్ధరించింది. కోర్టు తీర్పుతో రాహుల్ పై వేసిన అనర్హతను లోక్ సభ సచివాలయం ఎత్తివేసింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాహుల్ తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్ ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పార్లమెంట్ భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కూటమి సభ్యులు రాహుల్ కు ఘనంగా స్వాగతం పలికారు.













