ఉప రాష్ట్రపతిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడు
పెదవులతో కాకుండా హృదయంతో మాట్లాడే నాయకుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కొనియాడారు. భావోద్వేగాలతో ముడిపడిన వ్యక్తులు రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తుంటారని, అలాంటివారిలో ప్రథములు వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ పదవీకాలంలో ఆయన చేసిన ప్రసంగాలు, ప్రయాణాలు, తీసుకున్న చర్యలను కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్ పేరుతో కేంద్ర సమాచార ప్రసారశాఖ తీసుకొచ్చిన పుస్తకాన్ని రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర మంత్రి ప్రకాశ్జావడేకర్లు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ వెంకయ్య నాయుడితో ఒక సందర్భంలో మా మాట పెరిగి కోపానికిగురై వెళ్లిపోయాను. మళ్లీ ఇద్దరం కలుసుకున్నప్పుడు నావైపు నుంచి తప్పు జరిగిపోయిందని చెప్పారు. అప్పుడు ఆయన కళ్లనుంచి నీళ్లు జలజలా రాలాయి. మన మధ్య క్షమాపణలేంటని భావోద్వేగంతో అన్నారు. అప్పటినుంచి ఆయనపై గౌరవం మరింత పెరిగింది. ఎంపీగా ఆయన సభలో ఎప్పుడు మాట్లాడిన సభ్యులు చెవులు రిక్కించి వినేవారు. రాజ్యసభ అత్యధిక ఉత్పాదక సమావేశాలు వెంకయ్యనాయుడి హయాంలోనే జరగడం ఆయనకున్న నిబద్ధతకు నిరద్శనం. ఆయన మనసులో భయానికి చోటోలేదని నాకనిపిస్తుంటుంది అని రాజ్‌నాథ్ చెప్పారు. ప్రకాశ్జావడేకర్ మాట్లాడుతూ వెంకయ్య ప్రసంగాల్లో ఆలోచనలు, భావోద్వేగాలు రెండూ ఉంటాయి. విద్యార్థులు ఆయన ప్రసంగాలను చూస్తే చాలా నేర్చుకోవచ్చు అన్నారు.













