రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంటి ఆపరేషన్.. విశ్రాంతి అవసరమన్న వైద్యులు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆమె ఎడమ కంటికి ఈ శస్త్రచికిత్స జరిగిందని అధికారులు తెలిపారు. ఆర్మీ ఆస్పత్రికి చెందిన ఎస్కే మిశ్ర, ఆయన వైద్య బృందం ఆదివారం ఉదయం 11:30 గంటలకు ఈ ఆపరేషన్ చేశారు. సర్జరీ అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు ముర్మును డిశ్చార్జ్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి కొన్నిరోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. ‘ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కంటి ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆస్పత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యారు. కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు’ అని రాష్ట్రపతి భవన్ ప్రతినిధి అధికారికంగా ప్రకటించారు. భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన 64 ఏళ్ల ద్రౌపది ముర్ము.. ఈ ఏడాది జూలై 25న రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.













