ప్రధాని మోదీతో భేటీ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇక్కడకు రావడం భారత్‌తో ఆయనకున్న ప్రత్యేక అనుబంధానికి నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల ఇరు దేశాలు పలు సవాళ్లను ఎదుర్కొన్నాయని, పరస్పరం సహకరించుకోవడమే కాకుండా ఎంతో సున్నితంగా స్పందించాయని ప్రధాని గుర్తు చేశారు. కొవిడ్ సమయంలో పుతిన్ భారత్‌ను సందర్శించడం ఇది రెండోసారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. పుతిన్, ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత కొన్ని దశాబ్దాల్లో ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దేశాల మధ్య సంబంధాల్లో ఈక్వేషన్లు మారిపోయాయి. భారత్, రష్యా, స్నేహబంధం మాత్రం స్థిరంగా కొనసాగుతున్నదని ప్రధాని గుర్తు చేశారు. భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి రష్యా ఇచ్చే ప్రత్యేక ప్రాధాన్యతకు పుతిన్ పర్యటన నిదర్శనమని అన్నారు. ఈ పర్యటన ద్వారా ఇరు దేశాల బంధం మరింత బలపడుతుందని ప్రధాని అన్నారు.
భారత్‌ను శక్తిమంతమైన దేశంగా, కాలపరీక్షలో నెగ్గిన మిత్రదేశంగా పుతిన్ కొనియాడారు. మన దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. భవిష్యత్‌పైనా దృష్టి సారించామని పుతిన్ అన్నారు. సహజంగానే ఇరు దేశాలు ఉగ్రవాదంతో ముడిపడి ఉన్న సమస్యలపై శ్రద్ధ వహిస్తాయి. అంటే ఉగ్రవాదంతో పాటు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సంఘటిత నేరాలపై అని పుతిన్ గుర్తు చేశారు. ఆ క్రమంలోనే అఫ్ఘానిస్థాన్‌లో ఇటీవల పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. పర్యావరణం, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని పుతిన్ అన్నారు. పరస్పర పెట్టుబడులు 3800 కోట్ల డాలర్లకు చేరాయని ఆయన తెలిపారు.













