వారు ‘అన్నదాతలు’… వారిని అలా అంటామా?
రైతులను తాము ఎప్పుడూ ఉగ్రవాదులు, నక్సలైట్లు అని అనలేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారని, వారు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అని కొనియాడారు. అన్నదాతల ముందు మా తలలు వంచి గౌరవాన్ని ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం లాంటి సమయంలో రైతులే బాధ్యత తీసుకొని సమస్యల సుడిగుండాల నుంచి గట్టెక్కించారని ప్రశంసించారు. రైతు ప్రయోజనార్థం రూపొందించిన చట్టాలను రెండేళ్ల పాటు అమలు చేసి చూడాలని మరోసారి అభ్యర్థించారు. రాహుల్ గాంధీ పుట్టుకతోనే ధనవంతులని, ఆయన ధనవంతుల కుటుంబంలో జన్మించారని రాజ్‌నాథ్ అన్నారు. రాహుల్ తన కంటే వయసులో చిన్నవారని, తాను ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించాని, అందుకే రాహుల్ కంటే తనకే వ్యవసాయం గురించి ఎక్కువగా తెలుసని వివరించారు. రైతులపై తమ ప్రభుత్వానికి ఓ అవగాహన ఉంది కాబట్టే, తాము రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని స్పష్టం చేశారు. రైతుల నిరసతో తాను, ప్రధాని మోదీ తీవ్రంగా కలత చెందుతున్నామని పేర్కొన్నారు.
అందుకు నేను పూర్తి వ్యతిరేకం ….
బలవంతంగా మతాన్ని మార్చి, వివాహం చేసుకునే తంతుకు తాను వ్యక్తిగతంగా పూర్తి వ్యతిరేకినని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. బలవంతంగా మత మార్పిడులు చేసి, వివాహం చేసుకుంటున్నట్లు చాలా కేసులు రూఢీ అవుతూనే ఉన్నాయన్నారు. సహజంగా పెళ్లి చేసుకోవడానికి, బలవంతంగా మతం మార్చి పెళ్లి చేసుకోడానికి చాలా తేడా ఉందన్నారు. వీటన్నింటినీ కొన్ని రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకున్నాయని స్పష్టం చేశారు. అసలు బలవంతపు మత మార్పిడులు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. బలవంతపు మత మార్పిళ్లు ఆగాలని డిమాండ్ చేశారు. ‘‘నాకు తెలిసినంత వరకు ఇతర మతాలకు చెందిన వారితో పెళ్లిళ్లు చేసుకోడానికి ఇస్లాంలో ఆమోద ముద్ర ఉండదు. బలవంతపు మత మార్పిడి చేసి పెళ్లి చేసుకోడానికి వ్యక్తిగతంగా నేను వ్యతిరేకం’’ అని రాజ్‌నాథ్ ప్రకటించారు.
అన్ని దేశాలతో సత్సంబంధాలే కోరుకుంటున్నాం..
అన్ని దేశాలతో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటోందని రాజ్‌నాథ్ ప్రకటించారు. ఎవరైతే భారత్‌ను రెచ్చగొట్టాలని చూస్తారో, వారిని మాత్రం విడిచిపెట్టమని, తగిన బుద్ధి చెప్పి తీరుతామని తీవ్రంగా హెచ్చరించారు. భారత్ ఆత్మాభిమానంపై ఎవరు దెబ్బ కొట్టినా, ఏమాత్రం ఉపేక్షించమని స్పష్టం చేశారు. వ్యవహార శైలిలో కాస్త మృదుత్వం అవలంబించినంత మాత్రాన మెతక వైఖరితో ఉన్నట్లు కాదని, ఈ విషయాన్ని ఇతరులు గ్రహిస్తే బాగుంటుందని చురకలంటించారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో ప్రభుత్వం శరవేగంగా ముందుకు వెళ్తోందని, వీటితో ఏ దేశాన్నీ భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రం కాదన్నారు. కేవలం ప్రజల సౌకర్యార్థమే సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. భారత అంతర్గత వ్యవహారాల్లో ఏ ప్రధానీ జోక్యం చేసుకున్నా తాము చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని, ఆ హక్కు ఏ దేశానికీ లేదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.













