‘ఆజాదీ కా మహోత్సవ్’ కు ప్రధాని మోదీ శ్రీకారం
దేశ 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని చేపట్టిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. గుజరాత్ అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఆశ్రమం నుంచి దండి వరకూ నిర్వహించే పాదయాత్రను జెండా ఊపి, మోదీ ప్రారంభించారు. తదనంతరం అమృత మహోత్సవ్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశంలోని అన్ని వర్గాలూ పాల్గొన్నాయని, ఈ పోరాట స్ఫూర్తినే దేశం నేడు ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ఉప్పు ఆత్మ గౌరవానికి ప్రతీక అని, కష్టపడే తత్వానికి పత్రీక అని మోదీ పేర్కొన్నారు. ‘‘స్వాతంత్య్రోద్యమ సమయంలో ఉప్పు స్వావలంబనకు ప్రతీకగా ఉండేది. భారతీయ విలువలకూ ప్రతీక. ఈ విషయాన్ని ఆంగ్లేయులు గుర్తించి ఆత్మ విశ్వాసంపై దెబ్బకొట్టారు.’’ అని మోదీ పేర్కొన్నారు.
అప్పట్లో ఇంగ్లండ్ నుంచి వచ్చే ఉప్పుపై ఆధారపడే పరిస్థితి అప్పట్లో ఉండేదని, ఈ విషయాన్ని గాంధీజీ గుర్తించి, ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. దండి సత్యాగ్రహం కాస్తా… ప్రతి భారతీయుడి ఉద్యమంగానూ మారిపోయిందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామిక సంప్రదాయాలు మనకు గర్వకారణంగా నిలుస్తున్నాయని, స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో, ఆ తర్వాత సాధించిన విజయాలను ప్రపంచం ముందు ఉంచుతామని ఆయన వివరించారు. భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని, ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేసుకుంటూ భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. దేశంలో వ్యాక్సిన్లను తయారు చేసి, ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా భారత్ స్వావలంబన దిశగా పయనిస్తోంది, ఈ ప్రయాణం కేవలం భారత్‌కే కాదు, మొత్తం ప్రపంచానికే ప్రయోజనకరంగా ఉందన్న విషయాన్ని నిరూపించిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలు కేవలం భారత్‌కు మాత్రమే సొంతం కాదని, మొత్తం ప్రపంచ దేశాలకే కాంతిని చూపించబోతున్నాయని మోదీ తెలిపారు.
దండి మార్చ్ వార్షికోత్సవం సందర్భంగా పాదయాత్ర
దండి మార్చ్ వార్షికోత్సవం సందర్భంగా పాదయాత్ర చేపట్టారు. సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకూ 81 మంది 241 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తున్నారు. 25 రోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుంది. ఏప్రిల్ 5తో ముగుస్తుంది. ఈ పాదయాత్రను జెండా ఊపి మోదీ ప్రారంభించారు.
‘వోకల్ ఫర్ లోకల్’ అంటూ మోదీ ట్వీట్
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా శుక్రవారం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. స్థానిక వస్తువులు కొని, వాటిని లోకల్ ఫర్ లోకల్ యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులకు తీవ్రమైన ప్రచారం కల్పించడమే గాంధీజీకి నిజమైన నివాళి అని మోదీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.













