ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు
భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో సెప్టెంబరు 28 ఉదయం 11 గంటల ప్రాంతంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ సర్జన్. స్వామినాథన్ 1972-79 మధ్య ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
స్వామినాథన్ సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు వరించాయి. 1971లో రామ్ మెగసెసే అవార్డులు అందుకున్నారు. 1999లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అందుకున్నారు. ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 2007 నుంచి 2013 మధ్య పార్లమెంట్‌కు నామినేట్ ఎంపీగా సేవలందించారు. 1988లో ఎంఎస్ స్వామినాథన్ లాభాపేక్ష లేని రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించారు. స్వామినాథన్‌కు ముగ్గురు కుమార్తెలు. వీరిలో ఒకరైన సౌమ్య స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థలో 2019లో నుంచి 2022 వరకు చీఫ్ సైంటిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆమె ఎంతో కృషి చేశారు.













