కేరళ, బెంగాల్ ప్రభుత్వాలను చెడుగుడు ఆడుకున్న ప్రధాని మోదీ
కిసాన్ కల్యాణ్ సమ్మేళన్ వేదికగా కేరళ, బెంగాల్ ప్రభుత్వాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్‌లోని 70 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ నిధులు అందకుండా సీఎం మమత అడ్డుపడుతున్నారని మోదీ ధ్వజమెత్తారు. తన హయాంలో బెంగాల్‌ను పూర్తిగా భ్రష్టు పట్టించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కిసాన్ కల్యాణ్ సమ్మేళన్’’ పేరిట మధ్యప్రదేశ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు దీదీ అడ్డుపడుతున్నారని, దీని ద్వారా రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్యవసాయ మార్కెట్ల గురించి తెగ బెంగ పడిపోతన్న వారు బెంగాల్, కేరళలో వాటిని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ, బెంగాల్లో మార్కెట్ యార్డులు బలహీనపడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల్లో వీరు ఎందుకు ఆందోళనలు నిర్వహించడం లేదో చెప్పాలని మోదీ డిమాండ్ చేశారు. అక్కడ ఎందుకు ఉద్యమాలు చేయరని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీలో గుడారాలు వేసుకొని ఉన్న వారికి కేరళ ఏమాత్రం కనిపించదని మోదీ దుయ్యబట్టారు.
కార్పొరేట్లు రైతుల భూమిని లాక్కోవు : మోదీ
నూతన వ్యవసాయ చట్టాలపై కొందరు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మోదీ మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలు వచ్చి రైతుల భూములను లాక్కొంటాయని ప్రచారం చేస్తున్నారని, అలాంటిది జరగదని ఆయన స్పష్టం చేశారు. రైతుల భూములను ప్రైవేట్ వ్యక్తులు లాక్కోరని భరోసా ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ లాంటి మారుమూల ప్రాంతాల్లోని రైతులు కూడా ఈ విషయాన్ని నమ్మాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు వ్యక్తులు వార్తల్లో నిలవడానికే ఢిల్లీ వేదికగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను దాచేసి, రాజకీయాలు చేసి రైతులను మోసం చేస్తున్నారని ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోశారు. రైతులను బద్నాం చేసి కొందరు తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్నారని, రాజకీయాల్లో మెరిసిపోతున్నారని మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రైతుల ఖర్చు తగ్గించడానికే ప్రయాస పడుతున్నాం..
తమ కంటే ముందున్న ప్రభుత్వ విధానాల వల్లే రైతులు నష్టపోయారని మోదీ ఫైర్ అయ్యారు. తాము మాత్రం వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చి రైతులకు నూతన బలాన్ని చేకూర్చామన్నారు. పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డ్, సమ్మాన్ నిధి యోజన లాంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని లాభతరం చేయాలని చూస్తున్నామని తెలిపారు. రైతుల ఖర్చులు తగ్గించడానికే తాము కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన చట్టాలతో రైతు ఎక్కడైనా అమ్ముకునే వీలుందని, ఈ విధంగా రైతులు లాభపడితే వచ్చిన తప్పేంటని? మోదీ సూటిగా ప్రశ్నించారు.
18 వేల కోట్ల పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన మోదీ
కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయం కింద 18 వేల కోట్లను మోదీ విడుదల చేశారు. వీటిని నేరుగా రైతుల అకౌంట్లలోకే బదిలీ చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. దీని ద్వారా సొమ్ము దళారులకు వెళ్లే అవకాశమే లేదని, కమిషన్లు తీసుకునే ఛాన్సే లేకుండా పోతుందని అందుకే నేరుగా రైతుల ఖాతాల్లోకే వేశామని మోదీ వివరించారు.
మమత అహంకారం వల్ల బెంగాల్ రైతులు నష్టపోయారు : అమిత్ మాలవ్య
రైతుల అకౌంట్లలోకి ప్రధాని మోదీ 18,000 కోట్ల రూపాయలను విడుదల చేసిన సందర్భంగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రంగా విరుచుకుపడింది. మమత అహంకార ధోరణి వల్లే బెంగాల్ రైతులు నష్టపోయారని బీజేపీ ఐటీ సెల్ ఇన్చార్జి అమిత్ మాలవ్య మండిపడ్డారు. అర్హులైన రైతుల పేర్ల జాబితాను కేంద్రానికి పంపాలని తాము సీఎం మమతకు సూచించామని, ఆ ప్రతిపాదనను మమత తిరస్కరించారని ఆయన అన్నారు. అయితే ఈ ఆరోపణలపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పందించారు. తాము కేంద్రం ఇచ్చే సహాయం కంటే అధికంగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తరపున 5,000 రూపాయలను అందిస్తున్నామని పేర్కొన్నారు. నేరుగా కేంద్రం ఆర్థిక సహాయం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సౌగతా రాయ్ పేర్కొన్నారు.













