వీల్చైర్లో కూర్చొనే ప్రచారం నిర్వహిస్తా : బెంగాల్ సీఎం మమత
ఆస్పత్రి నుంచే బెంగాల్ సీఎం మమత ఓ వీడియోను రిలీజ్ చేశారు. మరో రెండు, మూడు రోజుల్లోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అవుతానని సీఎం మమత ప్రకటించారు. బుధవారం సీఎం మమతపై దాడి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయని, ఛాతీలో తీవ్రంగా నొప్పిగా ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సందర్భంలో తన కాలు కారు డోరులో ఇరుక్కుపోయిందని, ప్రస్తుతం చికిత్స జరుగుతోందని ఆమె తెలిపారు. కాలుకు బాగా దెబ్బతగిలిందని, అయినా ప్రచార షెడ్యూల్ లో ఎలాంటి మార్పూ ఉండదని ఆమె స్పష్టం చేశారు. వీల్చైర్లో కూర్చోనే ప్రచారం చేస్తానని, తనకు మద్దతు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రజలు, కార్యకర్తలందరూ శాంతియుతంగా, సామరస్యంగా ఉండాలని ఆమె కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ పనినీ చేయకూడదని వీడియో ద్వారా బెంగాల్ సీఎం మమత కార్యకర్తలకు సూచించారు.
మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసుకున్న తృణమూల్
మేనిఫెస్టో విడుదలను తృణమూల్ కాంగ్రెస్ వాయిదా వేసుకుంది. సీఎం మమత గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే తృణమూల్ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంది. షెడ్యూల్ ప్రకారం గురువారం మేనిఫెస్టోను రిలీజ్ చేయాలని తృణమూల్ భావించింది. ఈ విషయంపై తృణమూల్ నేత ఒకరు మాట్లాడుతూ… ‘‘మేనిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమాన్ని మేం వాయిదా వేసుకున్నాం. సీఎం మమత కోలుకున్న తర్వాత మేనిఫెస్టోను విడుదల చేస్తాం. మా మేనిఫెస్టో మాత్రం రెడీగానే ఉంది. ఆమె లేకుండా విడుదల చేసే ప్రసక్తే లేదు.’’ అని నేత పేర్కొన్నారు.
ఈసీని పోటాపోటీగా కలుసుకున్న తృణమూల్, బీజేపీ నేతలు
సీఎం మమతా బెనర్జీ దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అటు అధికార తృణమూల్ నేతలు, ఇటు ప్రతిపక్ష బీజేపీ నేతలు పోటాపోటీగా ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అయ్యారు. సీఎంగా ఉన్న మమతకు ఎందుకు సెక్యూరిటీ లేదన్న విషయంపై తాము ఈసీ నుంచి వివరణ కోరతామని, అభ్యర్థుల భద్రతకు ఈసీదే బాధ్యత అని తృణమూల్ పేర్కొంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈసీని కలిశారు. ప్రజలకు నిజానిజాలు తెలియడానికి సీసీ ఫుటేజీలను విడుదల చేయాలని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేసింది.













