అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన… 500 ఏళ్ల కల సాకారమైన వేళ…
శతాబ్దాల కల సాకారమైంది. కౌసల్య తనయుడు బాలరాముడు.. అయోధ్యలోని భవ్య,దివ్య మందిరంలో కొలువయ్యాడు. కళ్ల ముందు దివ్యమంగళ రూపం ఆవిష్కృతం కాగానే భక్తకోటి పరవశించింది. దిగ్గజ ప్రముఖులు, కళాకారులు, వ్యాపారవేత్తల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయంలో ప్రాణప్రతిష్ఠను సోమవారం ఘనంగా పూర్తిచేశారు. ఇదే స్ఫూర్తితో కొన్ని తరాలపాటు వెలుగులీనే భారత్‌ను నిర్మించుకుందామని పవిత్రధామం నుంచి ఆయన పిలుపునిచ్చారు.
దేశమంతా రామనామ జపంతో తరిస్తుండగా సోమవారం మధ్యాహ్నం 12.29 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా, అంగరంగవైభవంగా పూర్తయింది. వెయ్యేళ్లపాటు చెక్కుచెదరని రీతిలో నిర్మించిన భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన భక్తకోటి పరవశించిపోయింది. పవిత్ర క్రతువును పూర్తిచేయడానికి గత 11 రోజులుగా దీక్ష పాటిస్తున్న ప్రధాని.. చరణామృతం స్వీకరించి దానిని విరమించారు. ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ అధిపతి మోహన్ భాగవత్ తదితరులతో కలిసి మొత్తం కార్యక్రమాన్ని ఆయన జరిపించారు.
సర్వాంగ సుందరంగా అయోధ్య
వేడుకకు అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబై కళకళలాడింది. అన్ని ప్రాంతాలూ రామనామ స్మరణతో మార్మోగాయి. రామ్‌లీల, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అనేకచోట్ల ఏర్పాటుచేశారు. వేర్వేరు రాష్ట్రాల కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మోదీ ఉపవాసాన్ని విరమించారు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఆయనకు ‘చరణామృత్’ ఇచ్చి ఉపవాసాన్ని విరమింపజేశారు. దేశ, విదేశీ అతిథులు సుమారు ఏడువేల మంది ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు.
ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి.. మందహాసం, ప్రసన్నవదనంతో బాలరాముడు దర్శనమిచ్చారు. ప్రాణప్రతిష్ఠ సమయంలో ఆలయంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. ప్రాణప్రతిష్ఠకు ముందు పుజాసామగ్రితో ఆలయంలోకి తాను ప్రవేశిస్తోన్న వీడియోను మోదీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తనకు అంతులేని ఆనందంగా ఉందని ఉద్వేగానికి గురయ్యారు. 51 అంగుళాల ఎత్తయిన రామ్‌లల్లా విగ్రహానికి ప్రధాని- పుష్పాలు, నైవేద్యం సమర్పించారు. విగ్రహానికి బంగారు కడ్డీతో తిలకం దిద్దారు. అద్దంలో ముఖారవిందాన్ని రాముడికి చూపించారు. ఆ తర్వాత మోడీ సాష్టాంగ ప్రమాణం చేశారు. ఆలయం నుంచి మోదీ బయల్దేరాక ఆహ్వానితులను లోపలకు అనుమతించారు.
ఎన్నో బలిదానాలు, ఎన్నో త్యాగాల తర్వాత మన రాముడు మళ్లీ వచ్చాడని మోడీ ఉద్విగ్నభరితంగా ప్రసంగించారు. ఇప్పుడు వారి ఆత్మలన్నీ శాంతిస్తాయని అన్నారు. ఈ క్షణాన రామభక్తులంతా ఆనంద పారవశ్యంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఇకపై మన బాలరాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరంలేదని అన్నారు. రామ్ లల్లా ఇక నుంచి మందిరంలో ఉంటాడని పేర్కొన్నారు. 2024 జనవరి 22… ఇది సాధారణ తేదీ కాదని, కొత్త కాలచక్రానికి ప్రతీక అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రాముడు నాడు ధనుష్కోడిని దాటినప్పుడు కాలచక్రం మారింది, మళ్లీ ఇప్పుడు మారిందని వివరించారు. అయితే, ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడ్ని వేడుకుంటున్నానని వెల్లడించారు.
ఈ క్షణం కోసం అయోధ్య ప్రజానీకం వందల ఏళ్లు నిరీక్షించిందని తెలిపారు ప్రధానిమోడీ. దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం సాగించామని వివరించారు. 500 ఏళ్లలో ఆలయ నిర్మాణం ఎందుకు సాధ్యం కాలేదో ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.“రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. కానీ అయోధ్య వాసులు 5 శతాబ్దాలుగా ఈ క్షణం కోసం వేచిచూస్తున్నారు. భారత న్యాయవ్యవస్థ వారి స్వప్నాన్ని సాకారం చేసింది. ఈ క్షణం దేశ ప్రజల సహనానికి, పరిపక్వతకు నిదర్శనం. అత్యున్నతమైన ఆదర్శ వ్యక్తికి నేడు ప్రాణప్రతిష్ఠ జరిగింది. రాజ్యాంగబద్ధంగానే రామాలయం నిర్మించామన్నారు.
వసుధైక కుటుంబం అనేది మన జీవన విధానం. కానీ కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్థం చేసుకోలేకపోయారు. రాముడే భారత్ కు ఆధారం… రాముడే భారత్ విధానం… నేడు జరిగింది విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మాత్రమే కాదు… భారతీయ విశ్వాసాలకు ప్రాణ ప్రతిష్ఠ” అంటూ ప్రధాని మోడీ వివరించారు.













