కమల హారిస్ పూర్వీకుల గ్రామంలో సందడి
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ పూర్వీకుల గ్రామాలైన తమిళనాడులోని తుళసేంద్రపురం, పైంగనాడులో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఇళ్ల ముందు నమస్తే అమెరికా, కమలా హారిస్‌కు శుభాకాంక్షలు, హారిస్ విజయంతో గర్వపడుతున్నాం అంటూ ముగ్గులు వేశారు. తమిళనాడు మంత్రి కామరాజ్, ధర్మసాస్థ అయ్యానార్ ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రామస్థులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కమలాహారిస్ తాత పి.వి. గోపాలన్, తమిళనాడు లోని తిరువారూర్ జిల్లా మన్నార్ గుడి సమీపంలోని తుళసేంద్రపురం గ్రామానికి చెందిన వారు. అవ్వ రాజం.. పక్కనే ఉన్న మరో గ్రామం పైంగనాడు ప్రాంతానికి చెందిన వారు. స్టెనోగ్రాఫర్‌గా జీవితాన్ని ప్రారంభించిన గోపాలన్ ఆంగ్లేయుల ప్రభుత్వంలో సివిల్ సర్వీస్‌లో పనిచేశారు. అనంతరం కొంత కాలానికి అమెరికా వెళ్లారు.













