ఇస్రో మరో కీలక ప్రయోగం.. సెప్టెంబర్ 2న
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. సౌర అన్వేషణ కోసం వచ్చే నెలలో ఆదిత్య ఎల్ నింగిలోకి దూసుకెళ్లనుంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ని విజయవంతంగా దించి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లఖించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). ఇప్పుడు అదే ఉత్సాహంపై సూర్యుడి రహస్యాలను కనుగొనేందుకు ఇస్రో సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం చేపట్టనుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారి ఒకరు వెల్లడించారు. సెప్టెంబరు 2న ప్రయోగం చేపట్టే అవకాశాలున్నాయి అని సదరు అధికారి తెలిపారు. ఇప్పటికే ఈ ఉపగ్రహాన్ని సతీశ్ థమన్ స్పేస్ సెంటర్ (షార్)కు తీసుకొచ్చారు. పీఎస్ఎల్వీ-సి57 వాహకనౌక, ఆదిత్య-ఎల్ 1 ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లనుంది. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆస్ట్రేలియా, ఇతర దేశాల అంతరిక్ష సంస్థల సాయంతో ఇస్రో సౌర అధ్యయన ప్రక్రియను చేపట్టనుంది.













