ఇదే రోజున ఇస్రో ప్రపంచ రికార్డు
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నాలుగేండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ప్రపంచ రికార్డు సృష్టించింది. 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించి అరుదైన రికార్డును అంతరిక్ష పరిశోధనా చరిత్రలో లిఖించుకున్నది. నాలుగేండ్ల తర్వాత గత నెలలో ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఒకే మిషన్లో 143 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో రికార్డును బద్దులుకొట్టింది. అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒకేసారి అత్యధిక ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పింది.
2016 లో ఇస్రో ఒకే మిషన్లో 20 ఉపగ్రహాలను ప్రయోగించింది. దీని తరువాత పీఎస్ఎల్వీ- సీ37 నుంచి 2017 ఫిబ్రవరి 15న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ లాంచింగ్ సెంటర్ నుంచి 104 ఉపగ్రహాలను ప్రయోగించారు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్బీ సీ37 రాకెట్ సుమారు 30 నిమిషాల తరవాత 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో అంతరిక్ష పరిశోధనల్లో తమకు తిరుగులేదంటూ భారత్ ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. అంతకుముందు, ఒకే మిషన్లో అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన రికార్డు రష్యా పేరిట ఉన్నది. రష్యా 2014 లో 37 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఈ రికార్డును సాధించింది.













