ఇది ఎప్పుడైనా సంభవించవచ్చు.. ప్రపంచ బ్యాంక్ అధినేత
ప్రపంచం కొవిడ్ 19 తరహా మరో మహమ్మారిని ఎదుర్కోనుందని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా హెచ్చరించారు. ఇది ఎప్పుడైనా సంభవించవచ్చునని, అయితే ఇది అనివార్య పరిణామమే అవుతుందని స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని స్కిల్ ఇండియా మిషన్ సెంటర్ను ఆయన సందర్శించారు. కొవిడ్ నుంచి గట్టెక్కాం. అయితే దీనితో మనం పలు విధాలుగా కష్టాలు, నష్టాలను చవి చూశాం. ఇదే దశలో వీటిని ఎదుర్కొనే పాఠాలు నేర్చుకున్నామన్నారు. ఓ తరానికి సరిపడా చేదు అనుభవాలు, ఇదే దశలో సవాళ్లను తట్టుకునే తత్వం అలవర్చుకున్నామన్నారు. ప్రత్యేకించి విద్యార్థులకు విలువైన చదువుకునే దశలో చిక్కులు ఏర్పడ్డాయి. విద్యార్థుల జీవితకాలపు సంపాదన లో ఈ విధంగా ఎదురైన నష్టం 17 ట్రిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని 2021 ప్రపంచ బ్యాంక్ నివేదికలో తేల్చిన విషయాన్ని బంగా గుర్తు చేశారు. జరిగిన నష్టాన్ని మనం జరగబోయే మరో మహమ్మారి నష్టం ఎదుర్కొనేందుకు సమాయత్తం కావడంతో భర్తీ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.













