ఏఐలో ఇండియా దూకుడు.. ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్..!
కృత్రిమ మేధపై ప్రపంచం ఎలా స్పందిస్తుందన్న అంశంపై ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్ మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో భారతీయులు ..పూర్తి ఆశావాదం ప్రదర్శిస్తున్నారన్నారు. అమెరికన్లు మాత్రం దీనిపై కొంత ప్రతికూల దృక్పథంతో ఉన్నారని ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ అన్నారు. భారత్‌లో ఏఐని కొత్త మార్గాల్లో ఉపయోగించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ప్రశంసించారు. చాట్‌జీపీటీ వినియోగదారుల సంఖ్య పరంగా అమెరికాను అధిగమించి భారత్ తమ సంస్థకు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిందని వెల్లడించారు.
ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ షమానీ నిర్వహించే ‘ఫిగరింగ్ అవుట్’ పాడ్‌కాస్ట్‌లో ఆల్ట్‌మన్ ఈ విషయాలను వెల్లడించారు. అమెరికాలో సాధారణ వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏఐపై కొంత సందేహం, నిరాశ కనిపిస్తాయన్నారు. భారత్‌లో మాత్రం ఈ సాంకేతికతపై ఎక్కువ ఆశాభావం వ్యక్తమవుతోందని చెప్పారు. ఈ వ్యత్యాసం తనకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి
భారత్‌లో చాలామంది ఏఐని కేవలం సమాచారం తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా, వ్యాపారాలను ప్రారంభించడానికి, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి ఉపయోగిస్తున్నారని ఆల్ట్‌మన్ వివరించారు. నిధుల సేకరణపై గతంలో ఎలాంటి అనుభవం లేని ఓ భారతీయ విద్యార్థి.. తన పాఠశాల కోసం విరాళాలు సేకరించే మొత్తం ప్రక్రియను ఓపెన్ఏఐ సాధనాల సాయంతో నిర్వహించాడని ఉదాహరణగా చెప్పారు. ఏఐని ప్రజలు ఎంత సృజనాత్మకంగా ఉపయోగించుకుంటున్నారో ఈ ఘటన తెలియజేస్తోందన్నారు.
అభివృద్ధి వేగంగా జరుగుతున్న దేశాల్లో ఏఐకి ఎక్కువ ఆదరణ లభించే అవకాశం ఉందని ఆల్ట్‌మన్ అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా ఎదుగుతున్న దేశాల్లో ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆ అవసరాలను తీర్చడంలో ఏఐ కీలక పాత్ర పోషించగలదని వివరించారు. అందుకే భారత్ వంటి దేశాల్లో ఈ సాంకేతికతను స్వీకరించేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.







