దుష్యంత్ చౌతాలా తలొగ్గినట్టేనా?
కాంగ్రెస్ చేస్తోన్న ఒత్తిళ్లకు జననాయక్ జనశక్తి పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా తలొగ్గినట్టేనా? కొన్ని రోజులుగా కాంగ్రెస్ చేస్తోన్న ఒత్తిడి రాజకీయం తుది దశకు చేరుకుందా? రాజకీయంగా ఇప్పుడిప్పుడే పరిణతి సాధిస్తోన్న దుష్యంత్ భుజాలపై తుపాకీ పెట్టి ఖట్టర్ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడిద్దామనుకున్న కాంగ్రెస్ పాచిక పారినట్టేనా? డిప్యూటీ సీఎం దుష్యంత్ తాజా వ్యాఖ్యలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. రైతులకు కనీస మద్దతు ధర అందించలేనని, ఈ విషయంలో విఫలమయ్యానని భావించిన రోజు తన పదవికి రాజీనామా చేస్తానని కొన్ని రోజుల క్రితం ప్రకటించారు.
రైతు నిరసనలతో అసలే చికాకు మీదున్న బీజేపీకి… దుష్యంత్ తాజా అల్టిమేటం కాస్త ఇబ్బందే అని వార్తలొస్తున్నాయి. వ్యవసాయ చట్టాల్లో చాలా సవరణలు చేయాల్సి ఉందని, కేంద్రానికి కూడా చాలా సవరణలను తాము సూచించినట్లు ఆయన తెలిపారు. వీటిపై కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించిందని పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాల్లో చాలా సవరణలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనిపై కేంద్రానికి తాము కొన్ని సూచనలను చేశాం. మా ప్రతిపాదనలపై వారు సానుకూలంగానే స్పందించారు. రైతులకు కనీస మద్దతు ధర అందించలేనని నాకు అనిపించిన రోజు డిప్యూటీ సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేస్తా అని దుష్యంత్ మరోసారి పునరుద్ఘాటించారు.
గందరగోళంలో దుష్యంత్?
ముందు నుంచీ పంజాబ్ రైతులు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దుష్యంత్ పార్టీతో పాటు పంజాబ్‌లోని అన్ని పార్టీలకూ రైతులే ప్రధాన ఓటు బ్యాంక్. రైతులు నిరసనులు తార స్థాయికి చేరుకున్నా… దుష్యంత్ మాత్రం బీజేపీతో పొత్తును కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు బాగున్నాయని, కాస్త సవరణలు చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించారు. అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలే దీనిపై మండిపడుతున్నారు. దుష్యంత్ ఈ వ్యవహారంలో తీసుకున్న వైఖరి ఏమాత్రం రుచించడం లేదు. తమ తమ నియోజకవర్గాల్లో తమపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని, తమ అధినేత మాత్రం కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే కాంగ్రెస్ ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించింది. ప్రస్తుతం మనోహర్ లాల్ ఖట్టర్ సారథ్యంలోని బీజేపీకి ప్రధాన భాగస్వామిగా దుష్యంత్ కొనసాగుతున్నారు. ఎలాగైనా… బీజేపీ కూటమి నుంచి దుష్యంత్‌ను బయటికి లాగాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రైతులు ఇంత ఉద్యమాలు చేస్తుంటే.. దుష్యంత్ అధికారాన్ని అనుభవించడమా? వెంటనే రాజీనామా చేయాలి’’ అని కాంగ్రెస్ శిబిరం డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ… ‘‘రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ లో అకాలీదళ్ బీజేపీకి గుడ్ బై చెప్పింది. రాజస్థాన్ లో రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ బీజేపీకి గుడ్ బై చెప్పేసింది. దుష్యంత్ బీజేపీకి ఎప్పుడు గుడ్ బై చెబుతారా? అన్నదే ప్రశ్న. డిప్యూటీ సీఎం పదవికి ఎప్పుడు రాజీనామా చేస్తారన్నదే ప్రశ్న. హర్యానాలో బీజేపీకి జేజేపీ ఎప్పుడు తన మద్దతును ఉపసంహరించుకుంటుంది?’’ అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా సూటిగా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే దుష్యంత్ రాజీనామా అస్త్రాన్ని బయటికి తీసినట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు.













