ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ… ప్రకటించిన సీఎం కేజ్రీవాల్
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ విధిస్తున్నామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ ఈ కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ ముగిసిన తర్వాతే కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు. ఈ కర్ఫ్యూ సమయంలో మాల్స్, జిమ్, ఆడిటోరియంలు, స్పా సెంటర్లను పూర్తిగా మూసివేస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్లలో మాత్రం కేవలం హోండెలివరీకి మాత్రమే అవకాశం ఉంటుందని స్నష్టత నిచ్చారు.
ఇక సినిమా థియేటర్లు 30 శాతం కేపాసిటీతో నడపాలని సూచించారు. అత్యవసర సేవలు మాత్రం నిరంతరం అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. అత్యవసర సేవలు అందించేవారికి కర్ఫ్యూ పాసులు జారీ చేస్తామని తెలిపారు. ఢిల్లీలోని ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేదని, ప్రస్తుతం ఐదువేల పడకలు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. ప్రజలందరూ కరోనా నియమాలను తప్పకుండా పాటించాలని, మాస్కులు లేకుండా కనిపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే పెళ్లిళ్లు నిర్వహించుకునే వారికి పాస్‌లు జారీచేస్తామని తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలు ఆందోళనకు గురికావొద్దని, మీడియా కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 17,282 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో 50,736 యాక్టివ్ కేసులున్నట్లు పేర్కొన్నారు. 24 గంటల వ్యవధిలో 1,08,534 కోవిడ్ టెస్టులు చేయగా, 15 వాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేవు. దీంతో 15 హోటళ్లను తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చనున్నారు. వీటిని ప్రైవేట్ ఆస్పత్రులకు అనుసంధానం చేశారు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఒకరోజు బెడ్ ఖర్చు 5 వేలు, మిగితా హోటళ్లలో 4 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.













