ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం… మరో వారం పాటు లాక్డౌన్
కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్డౌన్ను మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3 ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని మ్యుమంత్రి ప్రకటించారు. ఢిల్లీలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. నిన్న రికార్డు స్థాయిలో 357 మరణాలు సంభవించాయి. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా, నిర్వహణకు పోర్టల్ ప్రారంభించామని తెలిపారు. తయారీదారులు, సరఫరాదారులు, ఆస్పత్రులతో కలిసి ఈ పోర్టల్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి ఆక్సిజన్ వివరాలు అప్డేట్ అవుతాయన్నారు. ఢిల్లీ ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా లాక్డౌన్ పొడిగించాలనే కోరారు అని కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ విధించకపోతే రానున్న రోజుల్లో భయంకర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ప్రజలు భయపడవద్దని, జాగ్రత్తలు వహించాలని సూచించారు.













