తమిళనాడులో మళ్ళీ లాక్ డౌన్?
తమిళనాడులో కొత్త వైరస్ వెలుగులోకి రావడంతో దానిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈనెల 28వ తేదీన వైద్యనిపుణుల బృందంతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ కరోనా స్ట్రెయిన్ పేరుతో కొత్త వైరస్ కేసు బయటపడింది. రెండు రోజులకు ముందు లండన్ నుంచి ఢిల్లీ మీదుగా చెన్నైకి చేరుకున్న ఇంజనీర్ కి వైద్య పరీక్షలు జరిపినప్పుడు కరోనా స్ట్రెయిన్ తాకిడికి గురైనట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో ఆయనను వెంటనే గిండి కింగ్ ఇన్ స్టిట్యూట్ సమీపంలోని ప్రభుత్వ కరోనా హాస్పిటల్ కి అధికారులు తరలించారు. ఆ ఇంజనీర్ నుంచి సేకరించిన రక్త నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం పుణేలో ఉన్న ప్రయోగశాలకు పంపారు.
ఆ పరీక్షా ఫలితాలు వెలువడిన తర్వాతే ఆ వైరస్ నిరోధానికి చర్యలు తీసు కుంటామని వైద్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరోనా స్ట్రెయిన్ వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నైలోని జాతీయ అంతర్జాతీయ విమానాశ్రయాలలో తీవ్ర నిఘా ఏర్పాటు చేశారు. అత్యంత నవీన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కరోనా పరీక్షలు జరిపే పరికరాలను కూడా అమర్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఈనెల 28న కరోనా వైరస్ నిరోధక చర్యలు చేపట్టే నిమిత్తం వైద్యనిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమవుతున్నారు. కొత్త వైరస్ కారణంగా కఠిన లాక్ డౌన్ ను అమలు చేయాలా వద్దా అనే విషయంపై వైద్యనిపుణుల కమిటీ సభ్యులతో ఆయన సమగ్రంగా చర్చలు జరుపబోతున్నారు.













