కేజ్రివాల్ హిందుత్వ నినాదం..! బీజేపీకి చుక్కలు చూపిస్తున్న నేత..!!
దేశంలో హిందుత్వ నినాదం ఊపందుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు అన్ని పార్టీలూ ఇంతోకొంతో ఆ నినాదాన్ని తలకెత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో మైనారిటీలను ఓటుబ్యాంకుగా పరిగణించి పార్టీలు పాలిటిక్స్ చేసేవి. ఇప్పుడు మైనారిటీలకు తోడు మెజారిటీ వర్గమైన హిందువులను కూడా పార్టీలు పట్టించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది బీజేపీ. కమలం పార్టీకి దేశవ్యాప్తంగా అదే నినాదం. కాబట్టి ఆ పార్టీ బాటలో మిగిలిన పార్టీలు కూడా నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రివాల్ కూడా హిందుత్వ నినాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఎంతగా అంటే.. బీజేపీ కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి.
బీజేపీకి సరైన మొగుడు ఎవరైనా ఉన్నారా.. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేజ్రివాల్ పేరు ఒక్కటే వినిపిస్తోంది. బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు కేజ్రివాల్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పలు పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయి. అయితే ఢిల్లీలోనే పాగా వేసిన కేజ్రివాల్ బీజేపీని ఎదుర్కొనేందుకు ముందుంటున్నారు. ఢిల్లీ, పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పై కన్నేసింది. ఇందుకోసం కేజ్రివాల్ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఓటుబ్యాంకును చీల్చి లబ్ది పొందాలనేది కేజ్రివాల్ వ్యూహంగా తెలుస్తోంది. అందుకే మిగిలిన పార్టీల కంటే ఎక్కువగా బీజేపీనే టార్గెట్ చేశారు.
ప్రతిరాష్ట్రంలో హిందుత్వ నినాదాన్ని బలంగా వినిపిస్తుంటుంది బీజేపీ. త్వరలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా బీజేపీ ఇదే సిద్ధాంతాన్ని నమ్ముకుంది. ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి. మరోసారి ఇక్కడ పాగా వేయాలని ఆ పార్టీ తపిస్తోంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో సత్తా చాటాలనుకుంటున్నారు కేజ్రివాల్. ఇందుకు బీజేపీ వినిపించే హిందుత్వ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. దీని ద్వారా కేంద్రంలోని బీజేపీనే ఇరుకున పెట్టాలనుకుంటున్నారు. కరెన్సీ నోట్లపై హిందూ దేవుళ్ల చిత్రాలను ముద్రించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. కరెన్సీ నోట్లపైన గాంధీతోపాటు లక్ష్మిదేవి, గణపతి బొమ్మలను ముద్రించాలని కోరుతున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు కేజ్రివాల్.
ఇండేనేషియాలో ఒక కరెన్సీ నోటు పైన గణేష్ విగ్రహాన్ని ముద్రిస్తారు. ముస్లిం దేశమైన ఇండోనేషియాలోనే కరెన్సీ నోట్లపైన గణేష్ విగ్రహాన్ని ప్రచురిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రచురించకూడదని కేజ్రివాల్ ప్రశ్నిస్తున్నారు. అందుకే కరెన్సీ నోట్లపై గణేష్, లక్ష్మీదేవి విగ్రహాలు ముద్రించేలా చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. మోదీకి ఈ మేరకు లేఖ రాశారు. బంతిని బీజేపీ కోర్టులో వేశారు. కరెన్సీ నోట్లపైన బొమ్మలను ముద్రించే అధికారం కేంద్రం, ఆర్బీఐ చేతుల్లో ఉంటుంది. ఇందుకు కొన్ని రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలిసే కేజ్రివాల్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు కరెన్సీ నోట్లపై హిందూ దేవుళ్ల నినాదాన్ని ఎత్తుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో లబ్ది పొందాలని కేజ్రివాల్ భావిస్తున్నారని అర్థమవుతోంది. ఏదైతేనేం.. హిందూత్వ నినాదంతో బీజేపీ అందరినీ ఇబ్బంది పెడుతుంటే.. కేజ్రివాల్ మాత్రం అదే నినాదంతో బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు.













