అంబానీ గ్రాండ్ పార్టీ … విందులో టిష్యూలకు బదులుగా కరెన్సీ నోట్లు?
అపర కుబేరుడు ముకేశ్ అంబాని ఇంట్లో ఏం జరిగినా ప్రత్యేకమే. తాజాగా అంబానీ కుటుంబం ఓ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది. రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్ నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతిక కేంద్రం ప్రారంభాన్ని పుస్కరించుకుని రాజకీయ, సినీ క్రీడా ప్రముఖలకు విందు ఇచ్చింది. ఈ సందర్భంగా అతిథులకు అంబానీ కుటుంబం కళ్లు చెదిరే ఆతిథ్యం ఇచ్చింది. అంబానీ పార్టీలో అతిథులకు ఎన్నో ప్రత్యేక వంటకాలను వడ్డించినట్లు తెలుస్తోంది. వెండి ప్లేట్స్‌లో పాలక్ పన్నీర, పప్పు కూర, రోటీ, హల్వా, డిజర్ట్, పాపడ్, లడ్డు వంటి పలు రకాల భారతీయ సంప్రదాయ వంటకాలను వడ్డించారట. ఇంత వరకూ బాగానే ఉన్నా భోజనం తర్వాత అందించిన స్వీట్ ప్లేట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
అతిథులకు ఎంతో ఖరీదైన దౌలత్ కి చాట్ ను సర్వ్ చేశారు. వడ్డించడానికి రెడీగా ఉంచిన ఆ స్వీట్ ప్లేట్లలో టిష్యూలకు బదులు కరెన్సీ నోట్లు ఉండటం నెట్టింట చర్చకు దారితీసింది. అయితే అవి నిజమైన కరెన్సీ నోట్లు కాదని తేలింది. దౌలత్ కి చాట్ ఢిల్లీ సహా నార్త్ ఇండియా లో బాగా ఫేమస్ అయిన డిజర్ట్. ఈ డిష్ శీతాకాలంలో మాత్రమే రెండు నెలల పాటు లభిస్తుంది. చిక్కటి పాల నుంచి తీసిన నురుగుతో పాటు పిస్తా, కోవా, చక్కెర పొడితో దీన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఢిల్లీకి చెందిన ఇండియన్ అసెంట్ అనే రెస్టారంట్ ఈ డిజర్ట్‌తో పాటు నకిలీ కరెన్సీ నోట్లను పెట్టి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. దీంతో ఈ వంటకం నార్త్‌లో చాలా పాపులర్ అయింది. ఇప్పుడు అంబానీ పార్టీలో కూడా దౌలత్ కి చాట్ డిజర్ట్‌ను ఫేక్ కరెన్సీ నోట్లతో సర్వ్ చేశారన్నమాట.













