సోషల్ మీడియాకు కేంద్రం వార్నింగ్
ట్విటర్‌తో నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో సోషల్ మీడియా యూజర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తప్పుడు వార్తలు వ్యాపింపజేసి, హింసకు ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రకటించారు. సోషల్ మీడియాను మేము గౌరవిస్తాం. ప్రజలకు అది సాధికారత కల్పించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియాది కీలకపాత్ర. అయితే తప్పుడు వార్తలను వ్యాపింపజేయడానికి, హింసను ప్రేరేపించడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవిశంకర్ సృష్టం చేశారు.
ఈ సందర్భంగా ట్విటర్, ఫేస్బుక్, యూట్యూబ్, లింకెడిన్ల పేర్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మీకు ఇండియాలో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. మీరు ఇక్కడ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ మరు కచ్చితంగా భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందే అని రవిశంకర్ తేల్చి చెప్పారు. కొశన్ హవర్ సందర్భంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై మాట్లాడుతూ ఆయన ఈ హెచ్చరికలు జారీ చేశారు.













