ఆత్మనిర్భర్ భారత్‌కి మద్ధతు: పవన్ కళ్యాణ్
భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవచించిన ఆత్మ నిర్భర్ భారత్‌కి పూర్తి మద్ధతు ఇస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ లోని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురువారం ప్రకటించారు. ఆత్మ నిర్భర్ భారత్ ఏ ఒక్క వర్గానికీ చెందినది కాదని ఇది ప్రజలందరిదీ అన్నారు. దీని ద్వారా భారత దేశం పురోగమిస్తుందన్నారు. మన పండుగలు, ఆచార సంప్రదాయాల్లో సైతం విదేశీ వస్తువులు భాగమైపోతున్నాయని, మన దేవతామూర్తుల విగ్రహాలు కూడాఅక్కడే తయారవుతున్నాయని పవన్ అన్నారు. తద్వారా మనకు తెలియకుండానే ఆ దేశ అభివృద్ధికి దోహదపడుతున్నామన్నారు. ఇకపై మనం ఏది కొన్నా అది స్వదేశీ ఉత్పత్తా లేక విదేశీ ఉత్పత్తా అనేది చూడాలని, ఈ వినాయక చవితి నుంచే నాంది పలుకుదామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
దేశీయ ఉత్పత్తులను వాడడం, మన స్వదేశీ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా మన అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన ఉత్పిత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి అని ఆయన తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్‌కి మద్ధతుగా దీనిలో ప్రజలను భాగస్థులనుగా మార్చడానికి భాజాపా, జనసేన పార్టీలు సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాయని చెప్పారు. మనం ఏ పని అయినా గణపతి పూజతోనే మొదలుపెట్టడం మనకు ఆనవాయితీ కాబట్టి వినాయక చవితి తర్వాత ఆత్మ నిర్భర్ భారత్‌ను ముందుకు తీసుకెళతామన్నారు.













