రైతులకు, ప్రభుత్వానికి ఒక్క ఫోన్ కాల్ మాత్రమే దూరం : ప్రధాని
ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఒకే ఒక ఫోన్ కాల్ దూరమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రైతులతో చర్చించడానికి తాము సదా సిద్ధమేనని ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర వ్యవధి పాటు నిలిపేసే ప్రతిపాదనకు తమ ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అంతేకాకుండా కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ ప్రకటించిన ప్రతిపాదనకు తాము ఇప్పటికీ సిద్ధమేనని పేర్కొన్నారు. ‘‘వ్యవసాయ చట్టాల విషయంలో తాము చేసిన ప్రతిపాదనకు కట్టుబడే ఉన్నాం. ఏడాదిన్నర పాటు సాగు చట్టాల అమలును నిలిపేసే విషయంలో కూడా ప్రభుత్వం సిద్ధమే. ఈ ఆఫర్ ఇప్పటికీ సజీవంగానే ఉంది. ఈ విషయాన్ని సహచరులకు తెలియజేయండి.’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘చర్చల సమయంలో తోమర్ అన్న వ్యాఖ్యలనే మళ్లీ చెబుతున్నా. మనం ఏకాభిప్రాయానికి రాలేకపోయాం. మేము ఓ ప్రతిపాదన పెడుతున్నాం. ప్రస్తుతానికి వెళ్లండి. మీ వారికి తెలియజేండి. వారెమన్నారో ఓ ఫోన్ కాల్ చేసి చెప్పండి. సరిపోతుంది.’’ అన్న తో మర్ వ్యాఖ్యలను మోదీ అఖిలపక్షంలో ఉటంకించారు.
ప్రభుత్వ మైండ్ సెట్ క్రమక్రమంగా మారుతోంది : అధీర్ రంజన్
మోదీ ప్రభుత్వ వ్యవహార శైలి, ఆలోచనా విధానం క్రమక్రమంగా మారుతోందని పార్లమెంట్లో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌది పేర్కొన్నారు. అఖిలపక్షం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు, కేంద్రం మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని మోదీ తమకు వివరించారని ఆయన పేర్కొన్నారు. గతంలో అహంకార పూరితంగా, మొండిపట్టుదలతో ప్రస్తుతం వ్యవహరించడం లేదని మెచ్చుకున్నారు. ప్రభుత్వానికి, రైతులకు మధ్య దూరం ఒకే ఒక ఫోన్ కాల్ అని మోదీ అన్నారని అధీర్ వివరించారు.













