పార్సల్ పంపాలా.. అయితే ఎందుకు టెన్షన్.. రైల్వే వాళ్లే మీ ఇంటి వస్తారు
హైదరాబాద్: సామాన్యులకు సేవలు అందించడంలో భారతీయ రైల్వే శాఖ సరికొత్త దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రైవేటు లాజిస్టిక్ సంస్థల కంటే మెరుగైన, చౌకైన సేవలను అందించడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ‘డోర్-టు-డోర్’ పార్సల్ సర్వీసును ప్రారంభించింది. ఇందుకోసం అత్యాధునికమైన ‘రైల్ పార్సల్ యాప్’ను అందుబాటులోకి తెచ్చింది. మీ వస్తువు ఏదైనా సరే, ఇంటికి వచ్చి పికప్ చేసుకుని, మీరు కోరుకున్న చిరునామాకు చేర్చేలా ఈ సేవలను తీర్చిదిద్దారు. విశేషమేమిటంటే, ప్రైవేటు సంస్థలతో పోలిస్తే దాదాపు 70 శాతం తక్కువ ధరకే రైల్వే ఈ పనులను పూర్తి చేస్తోంది.
ఒకప్పుడు రైల్వే ద్వారా పార్సల్ పంపాలంటే స్టేషన్‌కు వెళ్లి, ఫారాలు నింపి, క్యూలో నిలబడాల్సిన తంతంగం ఉండేది. కానీ ఈ కొత్త యాప్‌తో ఆ ఇబ్బందులన్నీ తొలిగిపోయాయి. ఈ యాప్‌లో స్టేషన్-టు-స్టేషన్, స్టేషన్-టు-డోర్, డోర్-టు-స్టేషన్ డోర్-టు-డోర్ అనే నాలుగు రకాల ఆప్షన్లు ఉన్నాయి. వినియోగదారులు తమకు నచ్చిన సేవను ఎంచుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు వంటి నగరాల నుండే కాకుండా చెన్నై, బెంగళూరు వంటి ఇతర మెట్రో నగరాలకు కూడా వస్తువులను పంపవచ్చు.
సామాన్యుల అవసరాల దృష్ట్యా ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా మారింది. హాస్టల్లో ఉండే పిల్లలకు వంట సామాన్లు పంపాలన్నా, బైక్‌ను వేరే ఊరికి తరలించాలన్నా లేదా ఉద్యోగ బదిలీ వల్ల ఇంటి సామాను మొత్తం మార్చాలన్నా రైల్వే పార్సల్ సేవలను వినియోగించుకోవచ్చు. రవాణాతో పాటు ప్యాకింగ్, అన్‌ప్యాకింగ్ స్టోరేజీ (వస్తువులను భద్రపరచడం) వంటి అదనపు సదుపాయాలను కూడా రైల్వే కల్పిస్తోంది. ప్రైవేటు సంస్థలు భారీగా ఛార్జీలు వసూలు చేసే పనులను, రైల్వే అతి తక్కువ ధరకే నాణ్యంగా చేస్తోంది.
ధరల విషయానికి వస్తే, 60 కేజీల బరువున్న వస్తువులను హైదరాబాద్ నుండి వైజాగ్‌కు పంపడానికి ప్రైవేటు సంస్థలు సుమారు రూ. 5500 అడుగుతుండగా, రైల్ పార్సల్ యాప్ ద్వారా కేవలం రూ. 1450 కే పంపవచ్చు. అలాగే బైక్ రవాణాకు ప్రైవేటు సంస్థలు రూ. 6000 నుండి రూ. 8000 వసూలు చేస్తే, రైల్వేలో గరిష్టంగా రూ. 2500 మాత్రమే అవుతుంది. ఈ సేవల కోసం రైల్వే కొన్ని ప్రైవేటు లాజిస్టిక్ సంస్థల సహకారం తీసుకుంటున్నప్పటికీ, ధరలు మాత్రం రైల్వే నిర్ణయించినవే ఉండటం సామాన్యులకు పెద్ద ఊరట. ఇప్పటివరకు వ్యాపారులకే పరిమితమైన ఈ సేవలు ఇప్పుడు సామాన్య ప్రజల ఇంటి ముంగిటకు రావడం నిజంగా విప్లవాత్మకమైన మార్పు.








