Ind vs SA: టాస్ వేయడానికి కెప్టెన్ ఎందుకు..?
భారత టి20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ లో అతని ఆట తీరు రోజు రోజుకి దిగజారుతోంది అంటూ మాజీలు, క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా(Australia) పర్యటన, ప్రస్తుతం జరుగుతోన్న సౌత్ ఆఫ్రికాతో జరుగుతోన్న సీరీస్ లో అతను విఫలం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. కెప్టెన్ అనే సాకుతో అతనిని జట్టులో ఉంచుతున్నారని, రోహిత్ శర్మ(Rohith sharma) కెప్టెన్ గా ఆడనప్పుడు అతనిని ఎందుకు సమర్ధిస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
సూర్యకుమార్ ఈ ఫార్మాట్ లో అర్ధ సెంచరీ చేసి.. 20 ఇన్నింగ్స్‌లు అయ్యింది. గత ఏడాది నవంబర్ నుంచి సూర్యకుమార్ 13.35 సగటుతో 227 పరుగులు మాత్రమే చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల హోమ్ సిరీస్‌లో అతని పేలవమైన ప్రదర్శన కొనసాగుతోంది. సూర్యకుమార్ మొదటి మ్యాచ్ లో.. 12 పరుగులు, తర్వాతి మ్యాచ్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. మూడవ మ్యాచ్ లో కూడా అతను సమర్ధవంతంగా ఆడకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
కెప్టెన్ పదవి ఇచ్చి అతనిని జట్టులో ఉంచుతున్నారని, వైస్ కెప్టెన్ పదవి ఇచ్చి శుభమన్ గిల్(Shubhaman Gill) ను కొనసాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది జనవరి నుంచి సూర్య నాలుగు అర్ధ సెంచరీలు చేసాడు. అవి కేవలం చిన్న జట్ల మీద మాత్రమే. అయినప్పటికీ అతనిని జట్టులో కొనసాగిస్తున్న నేపధ్యంలో మాజీ క్రికెటర్ లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అతని కోసం జైస్వాల్, రుతురాజ్ ను బలి చేసారని, ఇషాన్ కిషన్ మెరుగైన ఆటగాడు అయినప్పటికీ జట్టులోకి తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం అతను టాస్ వేయడానికి మాత్రమే ఆడుతున్నట్టు ఉందనే విమర్శలు ఉన్నాయి.






