కరోనా వచ్చింది అక్కడి నుంచే…

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టుకపై తాను ముందు చెప్పిందే నిజమైందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చైనాలోని వూహాన్ ల్యాబ్‍లోనే ఈ వైరస్‍ను సృష్టించారంటూ ఇటీవల పలు అధ్యయనాలు పేర్కొంటున్న నేపథ్యంలో ట్రంప్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని సృష్టించిన ఇంతటి విధ్వంసానికి పాల్పడినందుకు డ్రాగన్ కంట్రీ యావత్ ప్రపంచానికి భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. లక్షల మరణాలు, ఇంత విధ్వంసానికి కారణమైనా చైనా, యూఎస్‍తో పాటు ప్రపంచ దేశాలకు పది లక్షల కోట్ల డాలర్లు చెల్లించాలని ట్రంప్ చెప్పుకొచ్చారు.
తన వాదనను అప్పుడు ప్రముఖ అంటువ్యాధుల నివారణ నిపుణుడు డా.ఆంథోనీ ఫౌసీ సైతం కొట్టిపడేశారని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే వచ్చిందని అప్పటి అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది నిజమేనని ఇప్పుడు శత్రువులతో సహా ప్రతి ఒక్కరూ అంటున్నారు. కరోనా మహమ్మారి వచ్చి ఏడాది గడుస్తున్న ఇంకా దాని మూలాలపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.