అమెరికా కొత్త విధానం… ఈ నెల 31 నుంచి అమల్లోకి
ఇమిగ్రెంట్యేతర వీసా దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలను రద్దు చేయాలన్న అమెరికా కొత్త విధానం ఈ నెల 31 నుంచి అమల్లోకి వస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ తేదీ కోసం ఏడాదికి పైగా కూడా వేచి వుండాల్సి వస్తున్నందున ఆ సమయాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. కొవిడ్ కారణంగా వీసా ప్రాసెసింగ్ సామర్థ్యం కూడా బాగా తగ్గిందని విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయంగా ప్రయాణాలు తిరిగి పుంజుకుంటున్నందున, ఈ తాత్కాలిక చర్యలను తీసుకుంటున్నామని ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు 1 రకాల వీసా కేటగిరీలకు ఇంటర్వ్యూలు రద్దు కానున్నాయి.
హెచ్-1 బీ వీసాలు, విద్యార్థి వీసాలు, తాత్కాలికంగా వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్స్ అథ్లెట్లు కళాకారులు, ఇలా పలు రకాల వీసాలకు ఇంటర్వ్యూలు రద్దు చేసే తాత్కాలిక అధికారం అమెరికా కాన్సులర్ అధికారుల శుక్రవారం నుండి రానుంది. ఒక్కొక్క కేసు ప్రాతిపదికన, స్థానిక పరిస్థితులను బట్టి ఇంటర్వ్యూల విషయంలో అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లు నిర్ణయం తీసుకోవచ్చు. వీసా కాలపరిమితి ముగియడానికి 48 నెలల ముందుగా అదే వీసా క్లాస్లో వీసాను పునరుద్ధరించుకునేందుకు నిర్వహించే ఇంటర్వ్యూలను రద్దు చేసే అధికారాన్ని కూడా నిరవదికంగా పొడిగించారు.













