నలభై ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో అమెరికాలో
ప్రపంచంలో ఏ మూల సమస్య వచ్చిన రాకున్నా నేనున్నానంటూ తలదూర్చే అమెరికాకు ద్రవ్యోల్బణం మింగుడుపడటం లేదు. ఆయుధ శక్తిలో ఆర్థిక సంపత్తితో ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాకు ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోంది. దీంతో వివిధ దేశాలపై విధించిన కఠిన ఆంక్షల విషయంలో పట్టువిడుపు ధోరణితో ఉంటే ఎలా ఉంటుందనే అంశాన్నీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్గా పరిశీలిస్తున్నారు. నలభై ఏళ్లలో ఎన్నడూ చూడని గరిష్ఠ స్థాయిలో అమెరికాలో ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. ధరలు భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి అవసరమైతే చైనాపై విధించిన ఆంక్షల్లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అంశాన్ని ఆ దేశం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ విషయూన్ని యూఎస్ కామర్స్ సెక్రటరీ జినా రైమాండో తెలిపారు. అమెరికాలో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరడంతో చీఫ్గా వచ్చే చైనా వస్తువులు దిగుమతి చేసుకోవడం ద్వారా ధరల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగించే అవకాశం ఏమైనా ఉందేమో పరిశీలించాలంటూ జోబైడెన్ తమను ఆదేశించినట్లు రైమాండో తెలిపారు.













