అమెరికాలో విషాదం… చిత్తూరు యువతి ఆత్మహత్య
అమెరికాలోని టెక్సాస్‌లో చిత్తూరు పోలీసు కాలనీకి చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి కుమారుడు, వివాహానికి నిరాకరించాడనే మనస్తాపంతో మరుగుదొడ్లో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు చిత్తూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ (25) అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది. జిల్లాలోని పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన మురళి కుమారుడు భరత్ టెక్సాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వారిద్దరూ అక్కడే ఉంటుండటంతో ఇరు కుటుంబ సభ్యులు వారి పెళ్లి నిశ్చయించారు.
ఈ నెల మూడో తేదీన పెళ్లి జరిగేలా నిర్ణయించుకుని లగ్నపత్రికలు ముద్రించారు. పది రోజుల క్రితం వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో భరత్ తనకు పెళ్లి వద్దని, కొద్దిరోజుల సమయం కావాలని తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో ఇరు కుటుంబాలవారు ఇద్దరికీ నచ్చజెప్పారు. కొద్దిరోజుల తరవాత అన్నీ సర్దుకుంటాయని భావించి పెద్దలు పెళ్లి పనులు మొదలెట్టారు. ఈ నెల మూడో తేదీన పెళ్లి జరగాల్సి ఉండగా భరత్ పెళ్లికి నిరాకరించడంతో సుష్మ తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకుంది.













