కెనడాలోని ప్రముఖ స్వామినారాయణ్ ఆలయం ధ్వంసం.. భారత్కు వ్యతిరేకంగా ఆలయంపై రాతలు!
కెనడాలో హిందూ ఆలయంపై కొందరు దుండగులు దాడి చేసి, ఆలయాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఆ గుడిపై భారత్కు వ్యతిరేకంగా రాతలు రాశారు. ఈ ఘటన టొరంటోలో వెలుగు చూసింది. ఇక్కడి స్వామినారాయణ్ ఆలయాన్ని రాత్రికా రాత్రే ధ్వంసం చేసిన కొందరు.. భారత్కు వ్యతిరేకంగా ఆ ఆలయంపై రాతలు రాశారు. కెనడాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాదులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతూ భారత హై కమిషన్ తాజాగా ఒక ట్వీట్ చేసింది. టొరంటోలో ఉన్న స్వామినారాయణ్ మందిరంపై యాంటీ ఇండియా గ్రాఫిటీలు వేశారని ఇండియన్ హై కమిషన్ తెలిపింది. కెనడాలోని హిందూ ఆలయాలపై ఇలాంటి దాడులు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, ఇటువంటి విద్వేష చర్యలను అడ్డుకోవాలని, ఈ ఘటనల వల్ల కెనడాలోని హిందువులు భయాందోళనలకు గురవుతున్నారని ఎంపీ చంద్ర ఆర్య అన్నారు. దీనిపై కెనడా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక భారతీయులు కూడా డిమాండ్ చేస్తున్నారు.













