సుధామూర్తికి గ్లోబల్ ఇండియన్ అవార్డు
ప్రముఖ రచయిత్రి, ఇన్ఫీ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తికి కెనడా ఇండియా ఫౌండేషన్ (సిఐఎఫ్) గ్లోబల్ ఇండియన్ అవార్డును ప్రదానం చేసింది. ఇండో-కెనడియన్ గాలాలో ఈ పురస్కారం అందజేశారు. అవార్డు కింద 50 వేల డాలర్ల నగదు బహుమతి ఇచ్చారు. ప్రతి ఏటా ఒక్కొక్క రంగంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ భారతీయులకు ఈ పురస్కారం ప్రదానం చేస్తుంటారు. 2014లో ఇదే పురస్కారాన్ని నారాయణమూర్తి అందుకోవడం వివేషం. గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్న దంపతులుగా వీరు అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.
సుధామూర్తికి అవార్డును అందజేయడం చాలా సంతోషకరం. అమె తన కెరీర్ మొత్తాన్ని భవిష్యత్ తరాలకు స్పూర్తినిచ్చే దాతృత్వాలతో నింపింది. సమాజానికి తిరిగి ఇవ్వడానికి ఆమె మొగ్గుచూపుతుంది అని ఇండియా కెనడా ఫౌండేషన్ చైర్మన్ సతీష్ థక్కర్ అన్నారు. ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ సీఐఎఫ్ మహాభారతంలో కృష్ణుడి లాంటిది. కృష్ణుడు దేవకి, యశోదల కుమారుడు. ఒకరు కన్నతల్లి, ఇంకొకరు పెంచినతల్లి. అలాగే మీకు కూడా ఇద్దరు తల్లలు. ఒక భారతదేశం, ఇంకొకటి కెనడా. ఇక్కడ మీరు భారతీయ సంస్కృతికి వారసులు. దాన్ని అలాగే కొనసాగించండి అని పిలుపునిచ్చారు.













